తండ్రి 420.. కొడుకు 840 వచ్చే ఏడాది కవితకు జైల్లోనే బతుకమ్మ ఆట : రాజగోపాల్​రెడ్డి

  • కేసీఆర్​ ఖేల్​ ఖతం చేయడానికే మునుగోడు బైపోల్​ వచ్చింది
  • కూసుకుంట్ల రూ. 10వేలు సాయం చేసినట్లే చేసి దాంట్ల ఐదువేలు తాగుతడు
  • టీఆర్​ఎస్​ కౌరవ సైన్యం మునుగోడులో దిగిందని ఫైర్​
  • కేసీఆర్​ లక్షల కోట్లు మింగి.. రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసిండు: వివేక్​ వెంకటస్వామి

యాదాద్రి, వెలుగు: కేసీఆర్​ ఫ్యామిలీ అవినీతిలో కూరుకుపోయిందని, ఆయనకు కావాల్సింది బానిసలు, జీతగాళ్లని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మండిపడ్డారు. తాను రాజీనామా చేయడంతోనే ఫామ్​హౌసుల్లో నుంచి కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​రావు మునుగోడు ప్రజల కాళ్లకాడికి వచ్చారని అన్నారు. ‘‘కేసీఆర్ పెద్ద​ దొంగ. ఆయన 420 అయితే కేటీఆర్​ డబుల్​ దొంగ.. 840. పాలన మొత్తం మాఫీయాగా మారింది. ల్యాండ్, శాండ్, ధరణి  మాఫియాతో లక్షల కోట్ల అవినీతి సొమ్ము  సంపాదించుకున్నరు. బతుకమ్మ ఆడి ఆడి కవిత ఢిల్లీలో 800 వైన్స్​ షాపులు పెట్టింది. కవితమ్మ వచ్చే బతుకమ్మను జైల్లో ఆడుతది. కేసీఆర్​ కుటుంబానికి ఇప్పుడు ఉన్న జైళ్లు సరిపోవు. కొత్తగా మరో జైలు కట్టాలి” అని ఆయన దుయ్యబట్టారు.  ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్​ మండలం చిన్నకొండూరు, మసీదుగూడెం, జైకేసార్​లో రాజగోపాల్​పర్యటించి మాట్లాడారు. ప్రజల కోసం, ధర్మం కోసం రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడిన తనను మునుగోడు ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్​ అబద్ధాలు ఆడి, పిట్టకథలు చెప్పి అధికారంలోకి  వచ్చారన్నారు. తన నియోజకవర్గానికి ప్రభుత్వం సహకారించకున్నా.. తనకు చేతనైనంతలో సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రజలకు సాయం చేశానన్నారు.  ‘‘కేసీఆర్​ నాకు సబిత ప్లేస్​లో మంత్రి పదవి ఇస్తానని, డబ్బులిస్తానని చెప్పినా.. నిత్యం సలాం కొట్టలేనని తేల్చిచెప్పిన. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. అమ్ముడు పోలేదు. అవసరమైతే ఇంట్లనే పడుకుంటా కానీ సలాం కొట్టలేను. తెలంగాణ తెచ్చుకున్నదే ఆత్మగౌరవం కోసం. అలాంటిది కేసీఆర్​ కాళ్లకాడ ఆత్మగౌరవాన్ని ఎందుకు పెడ్త?” అని ప్రశ్నించారు. 

లెంకపల్లిలో పడుకోబోతున్నడు

మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందని తెలిసే కొత్తగా గట్టుప్పల్​ మండలాన్ని ప్రకటించారని, పింఛన్లు, రోడ్లు కూడా వస్తున్నాయని రాజగోపాల్​రెడ్డి అన్నారు. తనను ఓడించడానికి ఎక్కడ లేని విధంగా గొర్ల కాపరులకు1.50 లక్షలు అకౌంట్లలో వేశారని తెలిపారు. ప్రజల కోసం రాజీనామా చేసి ఈ ధర్మయుద్ధంలో నిలిచిన తనపై పోటీకి దిగిన డమ్మీ క్యాండిడేట్ కూసుకుంట్లను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్​ ప్రకటించారని విమర్శించారు. ‘‘కూసుకుంట్లను వందసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా.. ప్రయోజనం లేదు. చావులు, పెండ్లిండ్లకు 10 వేలు సాయం చేసినట్టే చేసి అండ్ల 5 వేలు ఆయనే తాగుతడు. ఈ ఎన్నిక నా కోసం రాలేదు.. కేసీఆర్​ ఖేల్​ ఖతం చేయడానికి వచ్చింది. అపాయింట్​మెంట్​ ఇయ్యనోడు లెంకపల్లిలో పడుకోబోతున్నడు. కేసీఆర్​ పాస్​పోర్టు బ్రోకర్​” అని దుయ్యబట్టారు. ‘‘పంటలు సాగు చేసే కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వకుండా.. సాగు చేయని వందల ఎకరాలు ఉన్నోళ్లకు ఈ పిచ్చోడు  రైతుబంధు ఇస్తున్నడు. తాగితాగి దుర్మార్గుడు కేసీఆర్​కు మైండ్​ దొబ్బింది. స్పీకర్​ సహా ఎమ్మెల్యేలందరికి భూములున్నా ఎవరూ వ్యవసాయం చేయడం లేదు. కౌలుకు ఇస్తున్నరు. అలాంటి లీడర్లకు  రైతుబంధు ఇవ్వడం అవసరమా..?’’ అని ప్రశ్నించారు.  ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ప్రజల కోసం తాను రాజీనామా చేసి ఎన్నికలకు దిగానని, అలాంటి తనను ఓడించడానికి టీఆర్​ఎస్​ కౌరవసైన్యం డబ్బు సంచులతో దిగిందని ఆయన మండిపడ్డారు.

లక్ష కోట్లు మింగిన కేసీఆర్:  వివేక్​ వెంకటస్వామి

తెలంగాణలో 16 లక్షల ఇండ్ల నిర్మాణానికి, రోడ్ల నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ. లక్ష కోట్లు ఇస్తే.. వాటిని సీఎం కేసీఆర్​ దిగమింగారని, కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లను కేటీఆర్​కు దోచిపెట్టారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. ‘‘ఒకప్పుడు 20 ఎకరాలే ఉన్న కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పుడు అవినీతి డబ్బుతో 600 ఎకరాల్లో ఫాంహౌస్​లు నిర్మించుకున్నది. రాష్ట్రంలో కేసీఆర్​ ఎవ్వరికీ ఇండ్లు ఇవ్వకున్నా.. ప్రధానమంత్రి మోడీ మాత్రం దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు నిర్మించి ఇచ్చారు. యువతకు ఇస్తానన్న ఇంటికో ఉద్యోగం కేసీఆర్​ ఇవ్వలేదు. తన కుటుంబానికి మంత్రి పదవులు ఇచ్చుకున్నడు. చివరికి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు” అని ఆయన అన్నారు. ‘‘ముఖ్యమంత్రి కాకముందు పైసలు లేని కేసీఆర్ రాష్ట్ర ఖజానాకు బొక్కపెట్టి ఇప్పుడు రూ. 200 కోట్లతో విమానమే కొనుక్కున్నడు. తెలంగాణ ఏర్పడినప్పుడు రూ. 60 వేల కోట్ల అప్పు ఉంటే.. ఇప్పుడు రూ. 5 లక్షల కోట్లకు చేర్చిండు.  టీఆర్​ఎస్​ పార్టీకి రూ. 800 కోట్ల ఫండ్​ సమకూర్చుకున్నడు”అని మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గంలో కేసీఆర్​ ఇండ్లు కట్టివ్వకున్నా.. రాజగోపాల్​రెడ్డి మాత్రం కొందరికి తన సొంత పైసలతో ఇండ్లు కట్టించి ఇచ్చారని ఆయన అన్నారు. మునుగోడు ప్రజల కోసం రాజగోపాల్​రెడ్డి రాజీనామా చేశారని, ఆయనను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈఎస్​ఐ హాస్పిటల్​, రోడ్ల కోసం రూ.200 కోట్లు, స్టేడియం వస్తుందని తెలిపారు. ‘‘సీఎం కేసీఆర్​ ఓటుకు రూ. 50 వేలు ఇచ్చి ఓట్లు కొంటానని చెప్తున్నడు. ఆ డబ్బును తీసుకొని రాజగోపాల్​రెడ్డికి ఓటు వేయాలి” అని ప్రజలను కోరారు.