కంటోన్మెంట్, వెలుగు: రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోగా స్కూటీ అదుపుతప్పి తండ్రీ కూతురు కిందపడ్డారు. అదే టైమ్ లో వచ్చిన డీసీఎం కుమార్తెను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది. ఈ ఘటన బుధవారం ఉదయం బోయిన్ పల్లిలో జరిగింది. అల్వాల్ లోని ఖానాజీగూడకు చెందిన విజయ్ కుమార్.. ప్రతిరోజూ తన కుమార్తె వైష్ణవి(17)ని స్కూటీపై బోయిన్ పల్లి బస్టాప్‌వద్ద డ్రాప్ చేస్తాడు. ఆమె అక్కడి నుంచి బస్సులో కూకట్ పల్లిలోని డిగ్రీ కాలేజీకి వెళ్తుంది.
బుధవారం ఉదయం ఇంటి నుంచి బయలు దేరిన విజయ్‌కుమార్.. బోయిన్ పల్లిలోని ఎంఎంఆర్ గార్డెన్ వద్ద మెయిన్ రోడ్ ఎత్తుగా ఉండటంతో కొద్దిదూరం రోడ్డు పక్క నుంచి వెళ్లాడు. మళ్లీ మెయిన్ రోడ్ ఎక్కేందుకు ప్రయత్నించగా.. ముందు గుంత ఉండటంతో దాన్ని తప్పించబోయాడు. ఈ క్రమంలో రోడ్డుపై స్కూటీ అదుపుతప్పి గుంతలో పడిపోయింది. విజయ్ కుమార్ రోడ్డు పక్కకు, అతని కుమార్తె రోడ్డుపై పడిపోయారు.
స్వల్పంగా గాయపడిన విజయ్‌కుమార్ స్కూటీని పైకి లేపుతుండగా.. అదే టైమ్ లో సుచిత్ర సర్కిల్ నుంచి ఓవర్ స్పీడ్ తో వచ్చి డీసీఎం వైష్ణవిని ఢీకొట్టింది. స్థానికుల సమాచారంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు వైష్ణవిని 108లో దగ్గర్లోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. వైష్ణవి హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందని.. ప్రస్తుతం ఆమె కోమాలో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డీసీఎం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. విజయ్ కుమార్ ఫిర్యాదుతో బోయిన్ పల్లి పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.