బైక్ పై నుంచి జారిపడిన తండ్రి కూతురు.. ఢీ కొట్టిన డీసీఎం

బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బైక్ పై నుంచి వెళ్తుండగా రోడ్డుపై ఉన్న గుంతలో నుండి అదుపు తప్పి తండ్రి కూతుళ్లు  కింద పడిపోయారు. వారు బైక్ పై నుంచి పడిపోయిన వెంటనే వారిని వెనుక నుంచి డీసీఎం ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో స్థానికులు వారిద్దరిని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం  కూతురు వైష్ణవి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.  MNR కాలేజ్లో డిగ్రీ చదవుతున్న వైష్ణవిని.. కాలేజీ బస్సు ఎక్కించేందుకు బైక్ పై వెళ్తుండగా ఈ  ప్రమాదం జరిగింది.  

మరోవైపు హైదరాబాద్ లో స్కూల్​బస్సు ఢీ కొట్టి ఓ చిన్నారి ప్రాణాలు విడిచింది. బాచుపల్లి ఇందిరానగర్​లో నివసిస్తున్న కిశోర్​తన కుమార్తె దీక్షిత(8)ను బౌరంపేటలోని స్కూల్​కి స్కూటీపై తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనక నుంచి వచ్చిన బస్సు వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి పై నుంచి బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.