
మెహిదీపట్నం, వెలుగు : చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగిస్తుండగా బురదలో చిక్కుకుకొని తండ్రీకొడుకు చనిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ నగరం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హుడా పార్క్ వద్ద బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలోని ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్ కరీం (40) జీహెచ్‌ఎంసీ కార్వాన్ సర్కిల్‌లో డెయిలీ లేబర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లుగా లంగర్‌హౌస్ హుడా పార్క్ చెరువు క్లీనింగ్ పనులు చేస్తున్నాడు.
శివరాత్రి సందర్భంగా బుధవారం స్కూల్‌కు సెలవు ఇవ్వడంతో తన కొడుకు సాహిల్ (14)ను తీసుకొని చెరువు క్లీనింగ్‌కు వెళ్లాడు. చెరువులో గుర్రపుడెక్క తొలగిస్తుండగా సాహిల్ బురదలో కూరుకుపోయాడు. గమనించిన కరీం కొడుకును కాపాడేందుకు ప్రయత్నించగా అతడు కూడా బురదలో ఇరుక్కోవడంతో ఇద్దరూ చనిపోయారు. గమనించిన జీహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న స్థానిక లీడర్లు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినొద్దీన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫోన్ చేశారు. దీంతో డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కరీం, సాహిల్ డెడ్‌బాడీలను బయటకు తీశారు. కాగా ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పనిచేయించడం ఏంటని ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ ప్రశ్నించారు.
ఎఫ్‌టీఎల్ మెషీన్లు కావాలని ఎన్ని సార్లు అడిగినా జీహెచ్ఎంసీ కమిషనర్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఏదో ఒక సాకు చెబుతూ వచ్చారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీతో పాటు ప్రభుత్వంతో మాట్లాడి మృతుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.