- కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో ఘోరం
- అర్ధరాత్రి ఇంట్లోకి పాము దూరడంతో చంపేసిన కుటుంబసభ్యులు
- అప్పటికే తండ్రీకొడుకులను కాటేసిన పాము..
- సకాలంలో గుర్తించక ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఘోరం జరిగింది. పాము కాటుకు గురై తండ్రీకొడుకులు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. రాజంపేట మండలం షేర్శంకర్తండా పంచాయతీలోని మూడు మామిండ్ల తండాకు చెందిన ముద్రించ రవి (40), మాన్విలకు ఇద్దరు కొడుకులు సంతోష్, వినోద్(11) అలియాస్బిక్కు, బిడ్డలు రోజ, శిరీష ఉన్నారు. శుక్రవారం రాత్రి భోజనం తర్వాత రవి, మాన్వి, వినోద్ ఒక రూమ్‌లో, ఇద్దరు అమ్మాయిలు, రవి తల్లి మరో రూమ్‌లో నిద్రపోయారు. రాత్రి 11 గంటలకు మాన్వికి మెలకువ రాగా.. రూమ్‌లో పాము కనిపించడంతో భర్తను నిద్ర లేపింది. దీంతో పామును కర్రతో కొట్టి చంపారు.
అయితే అప్పటికే తండ్రీకొడుకుల చేతులకు పాము కాటు వేసిన విషయాన్ని వాళ్లు గమనించలేదు. తర్వాత అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి 1 గంట టైమ్‌లో వినోద్ వాంతి చేసుకోవడంతో నిద్రలేచారు. పాము కాటు వేసిందని గుర్తించే లోపే వినోద్ చనిపోయాడు. ఆ తర్వాత తండ్రి రవి కూడా అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీంతో అతడిని ట్రీట్‌మెంట్ కోసం కామారెడ్డి జిల్లా హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. కానీ రవి అప్పటికే చనిపోయాడు. పాము కాటు వేసిన విషయాన్ని ముందే గుర్తించి ఉంటే ఇద్దరు బతికేవారంటూ బాధిత బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా హాస్పిటల్‌లో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత తండాకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.