పెంపుడు జంతువులు.. ఇందులో మన దేశంలో ఫస్ట్ ప్రయార్టీ కుక్క.. అవును ఇంట్లో కుక్కలను పెంచుకోవటం అనేది ఎప్పటి నుంచో ఉన్నా.. ఇప్పుడు మరీ ఎక్కవ అయ్యింది అనుకోండి. బిడ్డలెక్క చక్కగా సాకుతున్నారు జనం.. ఆ కుక్కలు కూడా ఎంతో విశ్వాసంగా ఉంటాయనేది అందరికీ తెలిసిందే.. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఇంట్లోని పెంపుడు కుక్క కరిచి.. తండ్రీ, కొడుకులు ఇద్దరూ నాలుగు రోజుల గ్యాప్ లో చనిపోవటం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు చూద్దాం...
విశాఖ జిల్లా భీమిలిలో తండ్రి నరసింగరావు(59), ఆయన కుమారుడు భార్గవ్ (27)ను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది. భార్గవ్ ను ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచింది. ఈ ఘటన జరిగిన 2 రోజుల తర్వాత కుక్క చనిపోవడంతో వారు అప్రమత్తమై యాంటీ రేబిస్ ఇంజక్షన్ తీసుకున్నారు. అయితే అప్పటికే రేబిస్ సోకడంతో చికిత్స పొందుతూ నాలుగు రోజుల వ్యవధిలో తండ్రీ, కొడుకు మృతి చెందారు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.