టైర్ పేలి కంటైనర్‌‌ను ఢీకొట్టిన కారు.. తండ్రీకొడుకులు మృతి

మెదక్ (చేగుంట), వెలుగు: రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు చనిపోయారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు వద్ద శనివారం జరిగిన యాక్సిడెంట్‌‌‌‌లో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. నార్సింగి మండలం నర్సంపల్లికి చెందిన పీఏసీఎస్ మాజీ చైర్మన్ తౌర్యా నాయక్ (48), చిన్న కొడుకు అంకిత్ (10)తో కలిసి కారులో చేగుంటకు బయలుదేరారు. వల్లూరు వద్దకు రాగానే కారు టైరు పేలిపోయి అదుపు తప్పింది. డివైడర్‌‌‌‌‌‌‌‌ను దాటుకుని వెళ్లి.. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు పోతున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది.

దీంతో కారులో ఉన్న తౌర్యా నాయక్, అంకిత్ తీవ్రంగా గాయపడి స్పాట్‌‌‌‌లోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని.. కారులో ఇరుక్కుపోయిన డెడ్ బాడీలను వెలికి తీయించారు. పోస్టుమార్టం కోసం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.