జల్సాల కోసం తండ్రీకొడుకుల చోరీలు

  •     రూ.23 లక్షలు, 34  తులాల బంగారం స్వాధీనం 
  •     వివరాలు వెల్లడించిన డీసీపీ సీతారాం

జనగామ, వెలుగు: చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసి రూ. 23.20 లక్షలు, 34 తులాల బంగారం, 71 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు జనగామ డీసీపీ సీతారాం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..   మహబూబాబాద్​ జిల్లా మునగలవీడుకు చెందిన దాసరి మురళి (26), అతని తండ్రి దాసరి నర్సయ్య(55) ఇద్దరు హైదరాబాద్​ వనస్థలిపురంలో  ఉంటూ రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు  చేసేవారు.   జనగామ, బచ్చన్నపేట పోలీస్​ స్టేషన్​ పరిధిలో కూడా చోరీలకు పాల్పడ్డారు.  

నల్లొండ, తొర్రూరు, భూవనగిరి రూరల్​, హైదరాబాద్​, భువనగిరి పోలీస్​ స్టేషన్​లలో కేసులు నమోదు కాగా జైలు జీవితం గడిపారు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో నిందుతుల పై పీడీ యాక్ట్​ నమోదు చేశారు.  ఏసీపీ దేవేందర్​ రెడ్డి పర్యవేక్షణలో జనగామ, నర్మెట సీఐలు ఈ. శ్రీనివాస్​, నాగబాబు దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు.

మంగళవారం జనగామ మండలం యశ్వంతాపూర్​ సమీపంలో వెహికిల్​ చెకింగ్​ చేస్తుండగా ఇద్దరు నిందితులు పట్టుబడ్డారన్నారు. నిందితులను రిమాండ్​కు తరలించనున్నట్లు చెప్పారు. చోరీ కేసును ఛేధించేందుకు కృషి చేసిన ఎస్సైలు రఘుపతి, ఏఎస్​ఐ శ్రీనివాస రాజు, కానిస్టేబుళ్లు మహేష్​, రామన్న, కరుణకర్, తదితరులను డీసీపీ అభినందించారు.