కూతురిని వేధిస్తున్నాడని.. యువకుడిని చంపిన తండ్రి

కూతురిని వేధిస్తున్నాడని.. యువకుడిని చంపిన తండ్రి
  • మహబూబ్‌నగర్‌ జిల్లా తిర్మలాపూర్‌ గ్రామంలో ఘటన

చిన్నచింతకుంట, వెలుగు : తన కూతురిని వేధిస్తున్నాడన్న కోపంతో ఓ వ్యక్తి యువకుడిని హత్య చేశాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం తిర్మలాపూర్‌ గ్రామంలో గురువారం జరిగింది. ఎస్సై శేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు గ్రామానికి చెందిన షేక్‌ అబ్దుల్‌ రహమాన్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. అదే గ్రామానికి చెందిన అలీ ఖాన్‌ (24) అనే యువకుడు కొన్ని రోజులుగా రహమాన్‌ కుమార్తె వెంటపడి వేధిస్తున్నాడు. 

యువకుడిని పలుమార్లు మందలించినా అతడి తీరులో మార్పు రాలేదు. యువకుడి వేధింపులు భరించలేక రహమాన్‌ భార్య, కుమార్తెతో కలిసి మూడు రోజుల కింద చిన్నచింతకుంట మండలంలోని తిర్మలాపూర్‌ గ్రామానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అలీఖాన్‌ సైతం తిర్మలాపూర్‌ గ్రామానికి వచ్చి యువతి ఉంటున్న ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఆగ్రహానికి గురైన యువతి తండ్రి రహమాన్‌ ఇనుప రాడ్, కత్తితో అలీఖాన్‌పై దాడి చేశాడు. అనంతరం రాళ్లతో తలపై మోదాడు.

 దీంతో తీవ్రంగా గాయపడిన అలీఖాన్‌ స్పాట్‌లోనే చనిపోయాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అబ్దుల్‌ రహమాన్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు 
చేసినట్లు ఎస్సై తెలిపారు.