కొడుకుకు రూ.4 లక్షలు ఖర్చు చేసినా..  నయం కావట్లేదని తండ్రి ఆత్మహత్య

మెట్ పల్లి, వెలుగు: నాలుగు నెలల కొడుకుకు వచ్చిన వ్యాధి తగ్గకపోవడంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన పున్నం శ్రీనివాస్ (33) కూలి. రెండేండ్ల కింద అతడికి మెట్ పల్లి మండలం విట్టంపేటకు చెందిన హరిణితో పెండ్లయ్యింది. వీరికి నాలుగు నెలల కింద కొడుకు పుట్టాడు. కొద్ది రోజులకే అతడు అనారోగ్యానికి గురయ్యాడు. మలద్వారం వద్ద నాళం మూసుకుపోవడంతో నాలుగు నెలలుగా హాస్పిటల్స్​ చుట్టూ తిరుగుతున్నారు.

ఆపరేషన్ అవసరమని డాక్టర్లు చెప్పారు. అయితే, అది ఆరోగ్యశ్రీ కిందికి రాదని చెప్పడంతో రూ.4 లక్షలు అప్పుచేసి సర్జరీ చేయించాడు. అయినా కుదుటపడకపోవడం, చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండడంతో శ్రీనివాస్ మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో  సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని టైంలో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు ఎస్సై ఉమా సాగర్​ తెలిపారు.