
నర్సాపూర్, వెలుగు: కూతురి పెండ్లి కోసం చేసిన అప్పు తీర్చలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్ గ్రామం అర్జుతండాలో బుధవారం జరిగింది. నర్సాపూర్ ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం.. అర్జు తండాకు చెందిన హలావత్ గణేశ్ (42) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు.
రెండేండ్ల కింద కూతురి పెండ్లి కోసం కొంత అప్పు చేశాడు. సాగు కలిసి రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. దీంతో మనస్తాపానికి గురైన గణేశ్ బుధవారం మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఫైనాన్స్ కట్టలేక ఒకరు..
గూడూరు, వెలుగు: వాహనం కోసం తీసుకున్న ఫైనాన్స్ కట్టలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొల్లాపురంలో బుధవారం జరిగింది. ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిట్టల మధు (40) చేపల వ్యాపారం చేస్తుంటాడు. గ్రామాల్లో తిరిగి చేపలు అమ్మడం కోసమని ఆరు నెలల కింద రూ. 5.50 లక్షలతో టాటా ఏస్ ట్రాలీ వాహనాన్ని కొనుగోలు చేశాడు.
వ్యాపారం సరిగా నడవకపోవడంతో వాహనం కిస్తీలు కట్టడం, ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన మధు బుధవారం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడి భార్య జయలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.