కూతురి ఎంగేజ్‌‌మెంట్‌‌కు డబ్బులు లేక.. మనస్తాపంతో తండ్రి సూసైడ్‌‌.. సిద్దిపేట జిల్లాలో విషాదం

కూతురి ఎంగేజ్‌‌మెంట్‌‌కు డబ్బులు లేక.. మనస్తాపంతో తండ్రి సూసైడ్‌‌.. సిద్దిపేట జిల్లాలో విషాదం

గజ్వేల్‌‌ (వర్గల్​), వెలుగు : పెద్దకూతురు పెండ్లికి చేసిన అప్పులు తీరకపోవడం, చిన్న కూతురు ఎంగేజ్‌‌మెంట్‌‌కు అప్పు దొరకకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురి ఎంగేజ్‌‌మెంట్‌‌ జరగాల్సిన రోజే తండ్రి చనిపోయిన విషయం వెలుగుచూడడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే... సిద్దిపేట జిల్లా తున్కిఖల్సా గ్రామానికి చెందిన కొడగళ్ల అంజయ్య (57), స్వరూప దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

కూలీ పనిచేసుకుంటూ జీవించే వీరు నాలుగేండ్ల కింద రూ. 5 లక్షలు అప్పు చేసి పెద్ద కూతురి పెండ్లి చేశారు. ప్రస్తుతం చిన్నకూతురికి వివాహం నిశ్చయం కావడంతో శుక్రవారం ఎంగేజ్‌‌మెంట్‌‌ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ఖర్చులకు కావాల్సిన డబ్బుల కోసం అప్పు తీసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఎక్కడా సర్దుబాటు కాలేదు. 

శుక్రవారం (April 18) జరగాల్సిన ఎంగేజ్‌‌మెంట్‌‌కు గ్రామస్తులను ఆహ్వానించడంతో పాటు, ఎవరినైనా డబ్బులు అడిగి తీసుకొస్తానని చెప్పి గురువారం సాయంత్రం బయటకు వెళ్లాడు. రాత్రి పొద్దుపోయినా తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం గ్రామంలో రైతు వేదిక వద్ద చెట్టుకు ఉరి వేసుకున్న అంజయ్యను గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు గౌరారం ఎస్సై కరుణాకర్‌‌రెడ్డి తెలిపారు.