బ్రతికుండగానే కూతురికి దహన సంస్కారాలు చేసిన తండ్రి

ప్రేమ పెళ్లి చేసుకుందన్న కారణంతో కన్నకూతురికి బ్రతికుండగానే దహన సంస్కారాలు నిర్వహించాడు ఓ తండ్రి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్యాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన సమ్మెట శరత్ చంద్ర, నాంపల్లి ప్రీతి ఇద్దరూ గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శరత్ చంద్ర హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా.. ప్రీతి మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం చేస్తోంది.  

కొద్దిరోజుల క్రితం ప్రీతి తన ప్రేమ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసి.. పెళ్లి చేయాలని కోరింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో అమ్మాయి తల్లితండ్రులు అందుకు అంగీకరించలేదు. దీంతో వీరిద్దరూ వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు రక్షణ కల్పించాలంటూ వర్ధన్నపేట పోలీసులను ఆశ్రయించారు. 

ఫిర్యాదు అందుకున్న స్థానికి ఎస్‌ఐ వధూవరుల తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. గ్రామానికి చేరుకున్న ప్రీతి తల్లిదండ్రులు పెళ్లిని జీర్ణించుకోలేక.. కూతురు చనిపోయినట్లు ఆమె దుస్తులతో దిష్టిబొమ్మను తయారుచేసి దహన సంస్కారాలు చేశారు. శవయాత్ర కోసం భారీ ఏర్పాట్లు చేయగా, గ్రామస్తులు వారిని వారించడంతో కుటుంబ సభ్యులే దిష్టిబొమ్మకి దహన సంస్కారాలు నిర్వహించారు.