వ్యాపారుల వేధింపులు.. కొడుకు చేసిన అప్పులకు తండ్రి బలి..

  • వ్యాపారం కోసంరూ.2.20 కోట్లు అప్పు చేసిన కొడుకు 
  • తిరిగి చెల్లించాలని అప్పులోళ్ల వేధింపులు 
  • మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న తండ్రి 
  • ఖమ్మం టౌన్​లో ఘటన

ఖమ్మం, వెలుగు:  కొడుకు చేసిన అప్పులకు తండ్రి బలయ్యాడు. డబ్బులు తిరిగి చెల్లించాలని అప్పులోళ్లు వేధిస్తుండడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం నగరంలో జరిగింది. వీడీవోస్ కాలనీలో ఉంటున్న చేకూరి శ్రీధర్​తన వ్యాపార అవసరాల కోసం పలువురి నుంచి రూ.2.20 కోట్లకు పైగా అప్పులు తీసుకున్నాడు. అప్పులు ఇచ్చినోళ్లు డబ్బులు తిరిగి చెల్లించాలని కొద్దిరోజులుగా ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఆదివారం ఉదయం మహేందర్, కృష్ణమోహన్ అనే ఇద్దరు ఇంట్లోకి వచ్చారు. అప్పు చెల్లించాలని శ్రీధర్ తండ్రి సత్యంబాబు మెడ పట్టుకుని కొట్టబోయారు. ఆ టైమ్ లో ఆయన భార్య నాగేంద్రమ్మ అడ్డుకోగా, ఆమెను నెట్టేశారు. దీంతో నాగేంద్రమ్మ కుర్చీలో కూలబడిపోయారు. 

ఆ తర్వాత ఇద్దరూ తిట్టుకుంటూ వెళ్లిపోయారు. మహేందర్, కృష్ణమోహన్ తమను చంపుతామని బెదిరించారని పోలీసులకు సత్యంబాబు అదేరోజు ఫిర్యాదు చేశారు. మరోవైపు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారని మహేందర్, కృష్ణమోహన్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ గొడవ నేపథ్యంలో వాళ్ల డబ్బులు వాళ్లకు తిరిగి ఇచ్చేయాలని శ్రీధర్​ను తండ్రి సత్యంబాబు మందలించారు. అయితే తాను ఆ మొత్తాన్ని వ్యాపారంలో పెట్టానని, ప్రస్తుతం డబ్బులు ఇవ్వలేనని శ్రీధర్ చెప్పాడు. దీంతో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన తండ్రి సత్యంబాబు ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ఖమ్మం టూటౌన్​ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.