తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాకతీయ కెనాల్ గేటు వద్ద పిల్లలు సరదాగా ఫొటోలు దిగుతూ నీళ్లలో పడిపోయారు. ఇది గమనించిన తండ్రి వారిని కాపాడేందుకు నీళ్లలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్‌లోని రాంనగర్లో ఉండే విజయ్ (45) కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా నీటిపారుదల శాఖ పే అండ్ అకౌంట్స్ ఆఫీసులో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నాడు.
సోమవారం బక్రీద్ హాలిడే కావడంతో ఎల్ఎండీ కాలనీలోని తాపాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి కుటుంబసభ్యులతో కలిసి వచ్చాడు. దర్శనం తర్వాత ఎల్ఎండీ కాకతీయ కాలువ గేట్ల సమీపంలో ఫొటోలు దిగేందుకు వెళ్లారు. పిల్లలు సరదాగా ఫొటోలు దిగుతుండగా విజయ్అక్కడే ఉండి గమనిస్తున్నాడు. విజయ్ కూతురు సాయి నిత్య, కొడుకు విక్రాంత్ కాలుజారి నీళ్లలో పడిపోయారు.
ఇది గమనించిన విజయ్ వెంటనే వారిని కాపాడేందుకు నీళ్లలో దూకి గల్లంతయ్యాడు. కాకతీయ కాల్వ గేట్ల సమీపంలో చేపలు పడుతున్న జాలరి శంకర్ ఇది చూసి అక్కడకు వచ్చాడు. మునిగిపోతున్న పిల్లలను కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చాడు. విజయ్ ని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. వెతకగా విజయ్డెడ్బాడీ దొరికింది. మృతుడి కూతురు సాయి నిత్యశ్రీ చైతన్య కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్, కొడుకు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. పిల్లలను కాపాడిన శంకర్‌ను అభినందించారు.