స్కూల్‌‌‌‌ నుంచి ఆలస్యంగా వచ్చాడని కొడుకును తన్నిన తండ్రి…బాలుడు మృతి

స్కూల్‌‌‌‌ నుంచి ఆలస్యంగా వచ్చాడని కొడుకును తన్నిన తండ్రి…బాలుడు మృతి
  • మెట్ల పైనుంచి పడి చనిపోయాడంటూ నమ్మించే ప్రయత్నం
  •  స్థానికుల సమాచారంతో పోలీసుల విచారణ,తండ్రి అరెస్ట్‌‌‌‌
  • యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌ మండలం ఆరెగూడెంలో దారుణం

చౌటుప్పల్‌‌‌‌, వెలుగు : స్కూల్‌‌‌‌ నుంచి ఆలస్యంగా వచ్చాడన్న కోపంతో ఓ వ్యక్తి తన కొడుకు ఛాతిపై బలంగా తన్నడంతో ఆ బాలుడు చనిపోయాడు. అయితే మెట్ల పైనుంచి పడి చనిపోయాడని చెప్పి హడావుడిగా అంత్యక్రియలు చేస్తుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఎంక్వైరీ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌ మండలంలోని ఆరెగూడెంలో ఆదివారం వెలుగుచూసింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఆరెగూడెం గ్రామానికి చెందిన కట్ట సైదులుకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు భాను (14) చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌‌‌‌ స్కూల్‌‌‌‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శనివారం స్కూల్‌‌‌‌లో ఫేర్‌‌‌‌వెల్‌‌‌‌ పార్టీ ఉండగా ఆ కార్యక్రమానికి వెళ్లొద్దని సైదులు కొడుకుకు చెప్పి బయటకు వెళ్లిపోయాడు. అయితే భాను స్కూల్‌‌‌‌కు వెళ్లి రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సైదులు ఆగ్రహంతో భాను ఛాతిపై తన్నడంతో అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

గమనించిన కుటుంబ సభ్యులు చౌటుప్పల్‌‌‌‌ ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌కు తరలించగా భాను అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో తన కొడుకు మెట్ల పైనుంచి పడి చనిపోయాడని, పోస్ట్‌‌‌‌మార్టం అవసరం లేదంటూ చెప్పి భాను డెడ్‌‌‌‌బాడీతో స్వగ్రామానికి  చేరుకొని హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకొని అంత్యక్రియలను అడ్డుకున్నారు.

బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌‌‌‌మార్టంకు తీసుకువెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించగా పోలీసులు, కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు చౌటుప్పల్‌‌‌‌ సీఐ మన్మథ కుమార్‌‌‌‌ గ్రామానికి చేరుకొని భాను డెడ్‌‌‌‌బాడీని చౌటుప్పల్‌‌‌‌ ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌కు తరలించి పోస్ట్‌‌‌‌మార్టం నిర్వహించారు. అనంతరం సైదులును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.