ప్రేమించిందని కూతురిని చంపిన నాన్న.. తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య

కర్నాటకలో విషాదఘటన చోటుచేసుకుంది. పరువు కోసం కన్న కూతురిని దారుణంగా హతమార్చాడు ఓ తండ్రి. ఆ వార్త విన్న ప్రేమికుడు.. ప్రేయసి లేని జీవితం తనకెందుకని ఎదురుగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాలు..

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కెజిఎఫ్)లోని బంగారుపేట నివాసి కృష్ణమూర్తి అనే వ్యక్తికి.. కీర్తి(20) అను కూతురు ఉంది. ఆమె వేరే కులానికి చెందిన  గంగాధర్‌(24) అనే యువకుడిని ప్రేమించింది. అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ విషయమై తండ్రీ కూతుళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. 

మంగళవారం ఉదయం తండ్రీ కూతుళ్లు ఈ విషయమై మరోసారి  గొడవపడ్డారు. గంగాధర్‌తో ప్రేమ, పెళ్లి మానుకోవాలని కృష్ణమూర్తి.. కూతురికి సర్ది చెప్పాడు. ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ యువతి అందుకు అంగీకరించలేదు. తాను ప్రేమించిన యువకుడితోనే జీవితాన్ని పంచుకుంటానని తేల్చిచెప్పింది. దీంతో సహనం కోల్పయిన కృష్ణమూర్తి కూతురుగొంతుకోసి చంపేశాడు. అనంతరం ఆ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు.. ఆమె మృతదేహాన్ని ఫ్యాన్‌కు  వేలాడదీశాడు.

ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారించగా.. తండ్రి చెప్పిన సమాధానానికి పొంతన లేదనిపించింది. అనుమానంతో కృష్ణమూర్తిని అదుపులోకి తీసుకొని విచారించడం మొదలుపెట్టారు. ఈ లోపు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న గంగాధర్‌ కీర్తి మరణవార్త తెలుసుకొని తట్టుకోలేకపోయాడు. వెంటనే సమీపంలోని రైలు పట్టాల వద్దకు వెళ్లి ఎదురుగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

కన్నకూతురిని హతమార్చిన కృష్ణమూర్తిని అరెస్ట్ చేసినట్లు కేజీఎఫ్ పోలీస్ సూపరింటెండెంట్ ధరణి దేవి మీడియాకు తెలిపారు.