
అతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి.. మంచి జీతం.. సొంతిల్లు.. ఆస్తులు బాగానే ఉన్నాయి.. భార్య కూడా మంచిగా చదువుకున్నది.. వీరికి ఇద్దరు పిల్లలు. ఒకటో తరగతి, యూకేజీ చదువుతున్నారు.. ఇద్దరు పిల్లలు, భార్యతో హ్యాపీగానే సాగుతున్న జీవితం.. కాకపోతే అతనిలో ఓ బాధ లోలోపల ఉన్నట్లు ఉంది.. పోటీ ప్రపంచంలో నా పిల్లలు రాణించలేరని.. బాగా చదవటం లేదని భావించి.. కన్న కొడుకులు ఇద్దరినీ చంపి.. తానూ ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ ఘటన ఏపీ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. షాక్ అయ్యే ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
హోలీ పండుగ రోజు కాకినాడలోని సుబ్బారావునగర్‌లో జరిగిన ఈ దారుణం తీవ్ర విషాదాన్ని నింపింది. సర్పవరం సీఐ పెద్దిరాజు కథనం మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్.. కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్‌జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. కాకినాడ సిటీలోని ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య తనూజ, ఒకటో తరగతి చదివే ఏడేళ్ల జోషిల్, యూకేజీ చదివే ఆరేళ్ల నిఖిల్‌ఇద్దరు పిల్లలున్నారు. వారు సరిగా చదవడం లేదంటూ ఇటీవలే పాఠశాలను మార్పించారు.
Also Read : తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలి
హోలీ సందర్భంగా చంద్రకిశోర్ తన భార్య, పిల్లలను తీసుకుని ఆఫీసులో జరిగే హోలీ వేడుకలకు వెళ్లాడు. కొద్దిసేపు అక్కడ ఉన్న తర్వాత.. పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్ దగ్గరకు వెళ్లి వస్తాం.. నువ్వు ఇక్కడే ఉండు అంటూ పిల్లలను తీసుకుని చంద్రకిషోర్ బయటకు వెళ్లాడు. 10 నిమిషాల్లో రావాల్సిన భర్త ఎంత సేపటికీ రాకపోవటంతో.. ఫోన్ చేసింది భార్య తనూజ. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎంతసేపటికీ ఫోన్ తీయకపోవటంతో.. చంద్రకిషోర్ ఆఫీసులోని తోటి ఉద్యోగులను తీసుకుని ఇంటికి వచ్చింది భార్య తనూజ. తలుపులు వేసి ఉన్నాయి. దీంతో కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించాడు చంద్రకిషోర్.
తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. పిల్లలిద్దరూ నీళ్ల బకెట్ లో శవాలుగా కనిపించారు. ఆ ఇద్దరు పిల్లల చేతులు, కాళ్లకు తాళ్లు కట్టి ఉన్నాయి. కళ్ల ఎదుటే ఇద్దరు పిల్లలు, భర్త శవాలుగా కనిపించటంతో స్పృహ కోల్పోయింది భార్య తనూజ.
Also Raed : రూ.45 లక్షల ప్యాకేజీతో జాబ్.. కానీ విషాదకర రీతిలో యువకుడు సూసైడ్
ఆత్మహత్య ముందు చంద్రకిషోర్ సూసైడ్ లెటర్ రాశాడు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేక పోతున్నారని.. వాళ్లు బాగా చదవలేకపోతున్నారంటూ రాశాడు. ఇలా చదివితే పిల్లలకు భవిష్యత్ లేదని.. వాళ్లు ఈ పోటీ ప్రపంచంలో బతకలేరంటూ ఈ సూసైడ్ లేఖలో రాసి ఉంది. అందుకే ఇద్దరు పిల్లలను చంపి.. చనిపోతున్నానంటూ చంద్రకిశోర్ సూసైడ్ నోటులో రాసి ఉంది.
చంద్రకిషోర్ కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని.. చాలా ఆస్తులు ఉన్నాయని.. సొంతిల్లు ఉందని.. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటో అర్థం కావటం లేదని.. అంత పిరికివాడు కూడా కాదంటున్నారు కుటుంబ సబ్యులు. LKG, UKG పిల్లలు బాగా చదవకపోవటం ఏంటీ.. దానికే ఇలా ఆత్మహత్య చేసుకోవటం ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఈ ఘటన కాకినాడ పట్టణంలో షాక్ కు గురి చేసింది.