![సంగారెడ్డి జిల్లాలో దారుణం.. కూతురిని ప్రేమిస్తున్నాడని యువకుడిని హత్య చేసిన తండ్రి](https://static.v6velugu.com/uploads/2025/02/father-kills-young-man-for-loving-his-daughter_cXFAaHWQCS.jpg)
సంగారెడ్డి: తన కూతురిని ప్రేమిస్తున్నాడనే కోపంతో యువకుడిని బాలిక తండ్రి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న ఓ బాలికతో దశరథ్(26) చనువుగా ఉండటంతో బాలిక తండ్రి గోపాల్ అతడిపై కక్ష పెంచుకున్నాడు. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న గోపాల్.. తన కూతురుతో సన్నిహితంగా ఉంటున్న దశరథ్ను అంతమొందించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే దశరథ్ను హత్య చేశాడు గోపాల్. నిజాంపేట మండల శివారు అటవీప్రాంతంలో యువకుడి మృతదేహాన్ని తగలబెట్టినట్టు సమాచారం.
అనంతరం నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో గోపాల్ లొంగిపోయాడు. దశరథ్ కుటుంబ సభ్యులు మృతదేహం కోసం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడు దశరథ్కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త నాలుగు రోజులుగా కనిపించడం లేదంటూ మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దశరథ్ ను హత్య చేసినట్లు గోపాల్ అంగీకరించడంతో.. పోలీసులు మృతదేహాం కోసం వెతుకుతున్నారు.