కూతుర్ని ప్రేమిస్తున్నడని యువకుడి మర్డర్

కూతుర్ని ప్రేమిస్తున్నడని యువకుడి మర్డర్
  • మూడు రోజుల తర్వాత పోలీసుల వద్ద లొంగిపోయిన నిందితుడు 
  • డెడ్ బాడీ కోసం మృతుడి కుటుంబం, బంధువుల ఆందోళన
  • సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో ఆలస్యంగా తెలిసిన ఘటన  

నారాయణ్ ఖేడ్, వెలుగు:  కూతుర్ని ప్రేమిస్తున్నాడని కక్షగట్టి ఓ యువకుడిని ఆమె తండ్రి హత్య చేశాడు. మూడు రోజుల అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం రామచందర్ తండాలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. రామచందర్ తండాకు చెందిన దశరథ్(26) డ్రైవర్ గా చేస్తుండగా.. మూడు రోజు కింద సంగారెడ్డికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పాడు. 

అప్పటినుంచి అతడు కనిపించకపోవడంతో  కుటుంబసభ్యులు సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.  శనివారం దశరథ్ ను తనే హత్య చేశానని రామచందర్ తండాకు చెందిన గోపాల్ నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి  లొంగిపోయాడు. దశరథ్ కుటుంబ సభ్యులకు తెలియడంతో  డెడ్ బాడీ కోసం సాయంత్రం జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు వెళ్లి బాధిత కుటుంబానికి నచ్చజెప్పి పంపించారు.

చంపి.. డెడ్ బాడీని కాల్చేసి..! 

కూతుర్ని ప్రేమిస్తున్నాడనే కక్షతోనే దశరథ్ ను హత్య చేసినట్టు నిందితుడు గోపాల్ పోలీసుల వద్ద ఒప్పుకున్నట్టు తెలిసింది. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న బాలికతో దశరథ్ చనువుగా ఉండటంతో అతనిపై కక్ష పెంచుకుని ఆమె తండ్రి నిజాంపేట మండల శివారు అటవీ ప్రాంతానికి పిలిపించి హత్య చేసి.. అనంతరం డెడ్ బాడీని కాల్చివేసినట్టు పోలీసుల విచారణ చెప్పినట్టు తెలుస్తోంది. మృతుడు దశరథ్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.