పెండ్లైన గంటకే పెండ్లి కూతురి తండ్రి మృతి

మొగుళ్లపల్లి, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కాసులపాడులో పెండ్లైన గంటలోనే పెండ్లి కూతురు తండ్రి చనిపోయాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లికి చెందిన కట్ట సదయ్య(40), సాంబ దంపతులు కొడుకు, బిడ్డతో కలిసి కాసులపాడులోని అత్తగారింటి వద్ద వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. నాలుగేండ్లుగా సదయ్య శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో కూతురు అశ్వితకు హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం ముచ్చర్ల నాగారం గ్రామానికి చెందిన రాణా ప్రతాప్తో ఆదివారం పెండ్లి జరిగింది.

అయితే తాళి కట్టిన గంటలోనే అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి సదయ్య చనిపోయాడు.దీంతో పెండ్లి సంబురంలో ఉన్న కుటుంబసభ్యులు, బంధువులు ఒక్కసారిగా  విషాదంలో మునిగిపోయారు. పుట్టెడు దుఃఖంతో ఉన్న పెండ్లి కూతురును సంప్రదాయం ప్రకారం అత్తగారింటికి సాగనంపారు. సదయ్య డెడ్​బాడీని సొంతూరు రెడ్డిపల్లికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.