
ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకుందని తన కూతురికి ఇంటిముందు చావు ఫ్లెక్సీ కట్టించి శ్రద్ధాంజలి ఘటించాడు ఓ తండ్రి. ఈ ఘటన సిరిసిల్ల పట్టణంలో చోటుచేసుకుంది. చిలువేరి మురళి కూతురు చిలువేరి అనూష బీ.టెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో కాలేజీలో ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఇంట్లో ఎవరికి సమాచారం ఇవ్వకుండా అనూష ఈ నెల 07న తన ప్రియుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.
తమను కాదనుకుని వెళ్లిపోయిన కూతురు తలుచుకుని తండ్రి మురళి బోరున విలపించాడు. అమ్మలారా.. అయ్యలారా.. నా బిడ్డ వెళ్లిపోయింది. మంచి కాలేజీలో చదువుతోన్న అమ్మాయిని కొందరు ట్రాప్ చేశారు. ఇలా ఎవరూ బతకొద్దు. మీ తల్లిదండ్రులకు అన్యాయం చేయొద్దు. మీ కాళ్లు మొక్కుతా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదంటూ స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.