- నాగోల్ అక్షర టెక్నో స్కూల్ వద్ద ఘటన
ఎల్ బీనగర్,వెలుగు: తన పిల్లల టీసీ, బోనో ఫైడ్ లను ఆరేండ్లుగా ఇవ్వడం లేదని తండ్రి అర్ధనగ్నంగా స్కూల్ ముందు బైఠాయించి నిరసన తెలిపాడు. బాధితుడు తెలిపిన ప్రకారం.. తట్టి అన్నారం జీవీఆర్ కాలనీలో నివసించే ఆనం ధర్మారెడ్డి తన ఇద్దరు పిల్లలను నాగోల్ అక్షర టెక్నో స్కూల్ లో 2015లో ఒకరు 4వ తరగతి, మరొకరు 2వ తరగతి చదివారు. అదే ఏడాది వేరే స్కూల్ లో చేర్పించాడు.
తన పిల్లల టీసీ, బోనోఫైడ్ కోసం 2019 నుంచి ఇప్పటిదాకా స్కూల్ చుట్టూ తిరుగుతుండగా.. చివరకు స్కూల్ మేనేజ్ మెంట్ రూ.20 వేలు కడితేనే ఇస్తామని తేల్చి చెప్పింది. దీంతో చేసేదిలేక ధర్మారెడ్డి మంగళవారం స్కూల్ ముందు బైఠాయించాడు. ఫీజుల దోపిడీతో వేధించే స్కూల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. స్కూల్ మేనేజ్ మెంట్ కాళ్లు మొక్కినా కనికరించలేదని ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.