కూతురుని పాయింట్ బ్లాంక్ రేంజ్‎లో కాల్చి చంపిన తండ్రి.. అసలేం జరిగిందంటే..?

భోపాల్: మధ్యప్రదేశ్‎లోని గ్వాలియర్‎లో పరువు హత్య సంచలనం రేపుతోంది. కూతురు తాము చూసిన సంబంధం చేసుకోకుండా వేరే యువకుడిని ప్రేమించిందన్న కోపంతో తండ్రి దారుణంగా కాల్చి చంపాడు. హత్యకు ముందు యువతి తన ఫోన్‎లో రికార్డ్ చేసిన లాస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్వాలియర్‌లోని ఆదర్శ్ నగర్‌లో మహేష్ గుర్జార్ మమతా గుర్జార్ అనే దంపతులు నివసిస్తున్నారు. 

వీరికి తను గుర్జార్ అనే 20 ఏళ్ల కూతురు ఉంది. కూతురుకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిన మహేష్ ఓ సంబంధం చూశాడు. 2025 జనవరి 18న తను పెళ్లి ఫిక్స్ చేశారు. ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెళ్లి తనకు ఇష్టం లేదని.. తాను ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని తను కుటుంబ సభ్యులకు చెప్పింది. మరో మూడు రోజుల్లో పెళ్లి ఉండగా.. ఈ సమయంలో కూతురు తనకు పెళ్లి ఇష్టం లేదనడంతో తండ్రి మహేష్ తీవ్ర ఆగ్రహానికి గురి అయ్యాడు.

నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించిన కూతురు వినకపోవడంతో కోపాద్రిక్తుడైన మహేష్ పాయింట్ బ్లాంక్ రేంజ్‎లో గన్‎తో తనును కాల్చి చంపాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తను గుర్జార్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తను ఫోన్‎ను పరిశీలించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చనిపోవడానికి కొన్ని రోజుల ముందే తను ఫోన్‎లో వీడియో రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

ALSO READ | Maha Kumbamela: చనిపోయిన తల్లి ఫొటోతో.. కుంభమేళాలో పుణ్యస్నానం

‘‘హలో నా పేరు తను గుర్జార్. నా తండ్రి పేరు మహేష్ గుర్జార్. తల్లి పేరు మమత గుర్జార్. నేను గ్వాలియర్‌లోని ఆదర్శ్ నగర్‌లో నివసిస్తున్నాను. నేను ఒక అబ్బాయితో 6 సంవత్సరాలు గాఢంగా ప్రేమలో ఉన్నాను. అతడి పేరు భికం మావాయి. అతను ఆగ్రాలో ఉంటాడు. ఈ విషయం మా ఇంట్లోకి వాళ్లకి కూడా తెలుసు. మొదట్లో మా పెళ్లికి మా కుటుంబం ఒప్పుకుంది కానీ తర్వాత నిరాకరించింది. ఇప్పుడు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నన్ను బలవంతం చేస్తున్నారు. ఈ నెల 18న పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. 

కానీ నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి వద్దంటున్నందుకు మా అమ్మనాన్న నన్ను రోజు కొడుతున్నారు. శారీరకంగా హింసిస్తూ.. తాము చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు. కానీ ప్రేమించిన వ్యక్తిని కాకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ నేను చనిపోతే దానికి మా కుటుంబానిదే బాధ్యత’’ అని తను వీడియోలో పేర్కొంది. వీడియో ఆధారంగా ఇది ఒక పరువు హత్య అని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టారు.