Vaibhav Suryavanshi: నాన్న పొలం అమ్మేశాడు.. అమ్మ మూడు గంటలే పడుకునేది.. పేరెంట్స్ కష్టాల గురించి వైభవ్ మాటల్లోనే..

Vaibhav Suryavanshi: నాన్న పొలం అమ్మేశాడు.. అమ్మ మూడు గంటలే పడుకునేది.. పేరెంట్స్ కష్టాల గురించి వైభవ్ మాటల్లోనే..

ఒక వ్యక్తి వయసు, అనుభవం వచ్చిన తర్వాత సాధించే విజయానికీ.. అతి చిన్న వయసులో అచీవ్ చేసే సక్సెస్ కూ చాలా తేడా ఉంటుంది. మొదటి దాంట్లో కొన్నిసార్లు ఎవరి సప్పోర్ట్ లేకున్నా.. తనకున్న ప్రాపంచిక అనుభవాలతో, అభిరుచులతో ఒక వ్యక్తి లక్ష్యాన్ని ఎంచుకుని సాధించవచ్చు. ఇక్కడ పేరెంట్స్ సపోర్ట్ ఉండవచ్చు లేకపోవచ్చు. కానీ రెండవ కేస్ లో చిన్న వయసులో ప్రపంచం మాట్లాడుకునే స్థాయిలో విజయాన్ని అందుకోవాంటే కచ్చితంగా తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ సపోర్ట్ ఉండాల్సిందే. 

ఐపీఎల్ 25 లో అతి చిన్న వయసులోనే సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రుల పాత్ర అనిర్వచనీయం. రాజస్థాన్ రాయల్స్ తరఫున డూ ఆర్ డై మ్యాచ్ లో 35 బాల్స్ లో సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించాడంటే అతని విజయం వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకోవాల్సిందే. 

ఫైనాన్షియల్ మార్కెట్ లో ఒక సామెత ఉంటుంది.. ‘‘అన్ని గుడ్లు ఒకే ట్రేలో పెట్టవద్దు అని..’’. వేర్వేరు ట్రేలలో ఉంచితే ఒకటి కింద పడినా మిగతా ట్రేలో ఉన్నవైనా నష్టపోకుండా ఉంటామని దీని అర్థం. అదేవిధంగా జీవితంలో కూడా ఉన్న సొమ్ము, ఆస్తి అంతా ఒకే వ్యాపారం లేదా ఒకే అవసరానికి వాడొద్దు అని అంటుంటారు. ఎందుకంటే అందులో నష్టపోతే మరో ఆప్షన్ ఉండదు. కానీ వైభవ్ పేరెంట్స్ ఇవేవీ పట్టించుకోలేదు. తమ కష్టం, సమయం, ఆస్తి, ఆశ, ఆశయం.. అంతా కొడుకు భవిష్యత్తుపైనే పెట్టుబడిగా పెట్టారు. సక్సెస్ కాకుంటే మరో దారి లేదని తెలిసి కూడా పెద్ద రిస్క్ తీసుకున్నారు. 

ఈ క్రమంలో వైభవ్ ను క్రికెటర్ ను చేసేందుకు తమకున్న పంట పొలాన్ని అమ్మేశారు. వైభవ్ రాణించకపోతే భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నకు సమాధానం లేదు వాళ్లదగ్గర. ఉన్న ఆన్సర్ ఒకటే.. వైభవ్. అంతే.. ఆ చిన్న ధైర్యంతోనే కొడుకును క్రికెటర్ ను చేసేందుకు అన్నీ పోగొట్టుకున్నారు. తమ వృత్తీ, వ్యాపకం అంతా వైభవ్ క్రికెటే అన్నట్లుగా కలలు కన్నారు. 

పాట్నాలో పదేళ్ల వయసులోనే రోజుకు 600 బాల్స్ ప్రాక్టీస్ చేసేవాడు వైభవ్. 16 లేదా 17 ఏళ్ల బౌలర్లను ఎదుర్కునేవాడు వైభవ్. ప్రాక్టీస్ చేయించేందుకు బౌలర్లకు ప్రత్యేకంగా టిఫిన్, లంచ్ ఏర్పాటు చేసేవాడట వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవన్షీ. అందుకోసం ప్రతిరోజూ కనీసం 10 టిఫిన్ బాక్సులు తీసుకొచ్చేవాడట. 

మా అమ్మ మూడు గంటలే పడుకునేది..

వైభవ్ సూర్యవన్షీ సక్సెస్ స్టోరీ వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లతో కూడిన గాథ ఉంది. తన తల్లిదండ్రులు పడిన ఆవేదనను ఈ 14 ఏళ్ల కుర్రాడు పంచుకున్నాడు. ‘‘నేను ఇప్పుడు సాధించినది ఏదైనా అది మా పేరెంట్స్ కే చెందుతుంది. నేను ప్రాక్టీస్ కు వెళ్తానని మా అమ్మ నిద్ర మధ్యలోనే మేల్కొనేది. నా కోసం రాత్రి ఆలస్యంగా పడుకునేది. కేవలం మూడు గంటలు మాత్రమే నిద్ర పోయేది. మా నాన్న నా ఫీజుల కోసం తెల్లవారుజామునే పనులకు వెళ్లేవాడు. పొలం అమ్మేశాడు. మా నాన్న పనులకు వెళ్లినపుడు మా బ్రదర్ నా బాధ్యతలు చూసుకునేవాడు. ఇప్పుడు ఏదైతే సాధించానో.. అది మా అమ్మానాన్నల కష్టార్జితం.. త్యాగం’’ అని చెప్పుకొచ్చాడు ఈ యువ సంచలనం.