క‌న్న కూతురిని పొడిచి చంపిన తండ్రి

గాంధీనగర్: గుజరాత్ లోని సూరత్‌లో దారుణం జరిగింది. కన్నకూతురిని కత్తితో 25 సార్లు పొడిచి చంపాడో కసాయి తండ్రి. అడ్డొచ్చిన భార్యపైనా దాడి చేశాడు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రామానుజ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కడోదర ప్రాంతంలోని సత్య నగర్ సొసైటీలో అద్దెకు ఉంటున్నాడు. రాత్రి వేళ కూతురు టెర్రస్‌పై పడుకోవడంతో భార్యతో గొడవకు దిగాడు. దాంతో కూతురు టెర్రస్‌పై నుంచి కిందకి దిగి గొడవ పడొద్దని సర్దిచెప్పింది. అయినా, దంపతుల మధ్య మాటామాటా పెరగడంతో రామానుజ సహనం కోల్పోయాడు. కోపంతో పిల్లల ముందే తన భార్యపై కత్తితో దాడి చేశాడు. తల్లిని కాపాడుకునేందుకు పిల్లలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పిల్లలంతా తల్లికి సపోర్టుగా రావడంతో మరింత కోపానికి గురైన రామానుజ..తనకు దగ్గరగా ఉన్న కూతురిని కత్తితో 25 సార్లు పొడిచాడు. దాంతో ఆమె చనిపోయింది.

కూతురిని హత్య చేసిన తర్వాత రామానుజ తన భార్యను కూడా చంపేందుకు ఆమెను  వెంబడించాడు. అయితే, మిగిలిన పిల్లలు తల్లిని దాచిపెట్టారు. ఈ క్రమంలో వారికి కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రామానుజను అరెస్ట్ చేశారు. కత్తిని  స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు రామానుజపై హత్య, హత్యాయత్నం సహా పలు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.