ఆదివాసీల గొంతు స్టాన్ స్వామి

మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తులు, సంస్థలు చాలా తక్కువ. ఆ గుప్పెడు గొంతుకల కారణంగానే కాస్తో కూస్తో మానవహక్కులు అమలవుతున్నాయి. న్యాయంకోసం పోరాడటానికి సమాజం కొంతైనా జాగృతమై కదులుతోంది. న్యాయస్థానంలో న్యాయం లభిస్తుంది.. కొన్ని సందర్భాల్లో న్యాయం సుదీర్ఘ ఆలస్యం కావడం వల్ల పూడ్చుకోలేనంత భారీ నష్టం జరుగుతుంది. ఆదివాసీల కోసం యాభై ఏండ్లు పోరాడిన ఫాదర్ స్టాన్ స్వామి(84) జైలు నుంచి బయటకు రాకుండా రాజ్యం ఎన్నో సార్లు అడ్డుపడింది. చివరికి బెయిల్ దరఖాస్తు పై పరిశీలన జరుగుతున్న సమయంలో గుండె ఆగిపోయి ఆయన మరణించారు. 50 ఏండ్లు రాజీ లేకుండా హక్కుల పోరు చేసిన ఆ గొంతు మూగవోయింది. ఆదివాసీల హక్కుల గొంతుక బెయిల్ అవసరం లేకుండానే కోర్టుకు విచారణ అవకాశం లేకుండానే నిర్బంధంలోనే ఊపిరి వదిలింది.
నీళ్లు తాగేందుకు స్ట్రా కూడా ఇవ్వలేదు
కోరేగావ్ కు కనీసం వెళ్లని.. అక్కడ అడుగు కూడా పెట్టని స్టాన్ స్వామిపై దేశ ద్రోహం కేసు పెట్టారు. ఎల్గర్ పరిషత్ కేసులో 2020 అక్టోబరులో అరెస్ట్ చేశారు. జైల్లో పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయన నీళ్లు తాగడానికి స్ట్రా అడిగితే కూడా ఇవ్వలేదు. చివరకు స్ట్రా కోసం కోర్ట్ ను కోరాల్సి వచ్చింది. 1937లో తమిళనాడులో జన్మించారు. ఐదు దశాబ్దాలుగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న ఆయన రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ గా సేవలు అందిస్తున్నారు. 2020 అక్టోబరు 8న రాంచీలో స్టాన్ స్వామిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అప్పటికే అతను క్యాన్సర్, పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. అరెస్టుకు ముందు 15 గంటలపాటు ఇంటరాగేట్ చేసిన పోలీసులు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, కేసులో ఇరికించే ప్రమాదం ఉందని తాను అసలెన్నడూ కోరేగావ్ వెళ్లలేదని అక్టోబర్6న ఆయన పేర్కొన్నారు. చివరికి ఆయన చెప్పిందే జరిగింది. అరెస్ట్ ను పౌరహక్కుల సంఘాలు ఖండించాయి, క్యాథలిక్ సంస్థలు ఆందోళనలు, నిరసనలు చేశాయి. మానవహక్కులపై ప్రశ్నించే గొంతును జైలులో పెట్టడం అన్యాయమన్నాయి. రాజ్యం ఇవేవి పట్టించుకోలేదు. చివరికి ఆయన జైలులోనే మరణించారు. మరణించిన తర్వాత జేఎన్​యూలో క్యాండిల్స్ వెలిగించి మౌనంపాటించారు. నిరసనలు వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, శశిథరూర్, మహబూబా ముఫ్తీ.. స్టాన్ స్వామిని మానవతావాదిగా పేర్కొన్నారు. ఆయన 50ఏండ్ల సేవలు చిరస్మరణీయమని ట్విట్టర్​ ద్వారా నివాళి అర్పించారు.
జవాబుదారితనం లేని వ్యవస్థలు
2010 లో స్టాన్ స్వామి ‘బంద్ ఖైదీయోంకా సచ్’ (నిర్బంధంలో ఉన్న ఖైదీల నిజం) అనే పుస్తకం రాశారు. జైళ్లలో మగ్గుతున్న మూడువేల మంది ఆదివాసీలను విడుదల చేయాలని ఆందోళన చేశారు. ఆయన ఎంతటి మానవతావాది అంటే తాను పెద్ద ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లనని సామాన్య ఖైదీల లెక్కనే జైల్లోనే ఉంటానని అక్కడనే తన వాళ్ల మధ్యన చనిపోయినా పర్వాలేదన్నారు. పోలీసులకు జవాబుదారి తనం లేదని స్టాన్ స్వామి అరెస్టు అన్యాయం అని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తీవ్రంగా ఖండించారు. రిపోర్టులు, వివరాలు సబ్మిట్ చేయాలని కోరినపుడు.. ప్రభుత్వం పదేపదే అబద్దాలు ఎందుకు చెబుతోందని స్టాన్ స్వామి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ముంబై కోర్టు ప్రశ్నించింది. 66ఏ ను సుప్రీంకోర్టు2015 మార్చి 24న రద్దు చేసింది. అయినా ఆ సెక్షన్ కింద ఇంకా కేసులు పెట్టడం అరెస్టులు చేయడం ఆగడం లేదు. 66ఏ కింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన1360 కేసుల్లో 570 కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వాలకు సుప్రీంకోర్టుపై కూడా గౌరవం లేని పరిస్థితి ఇది. పీయూసీఎల్ నేత సుధ భరద్వాజ్ లాంటి వారు ఎందరో అక్రమ నిర్బంధాలను ప్రశ్నించి న్యాయంకోసం పోరాడుతున్నారు. బెయిల్ దొరక్క స్టాన్ స్వామి లాంటి వారు జైలులోనే మరణించిన తీరు మన న్యాయ వ్యవస్థకు ఒక సవాల్ గా నిలబడుతోంది.
పోడు సమస్యకు పరిష్కారమేది 
పోడు వ్యవసాయం చేసుకునే 30 లక్షలమంది ఆదివాసీలు టైటిల్ కోసం దరఖాస్తు చేసి పోరాడితే 2006 నుంచి 2011 వరకు కేవలం11లక్షల మందికే న్యాయం జరిగింది. మరి మిగిలిన వాళ్లు ఎటు పోవాలి. వారికి న్యాయం ఎవరు చేయాలి. పోడు భూముల సమస్య నేటికీ పరిష్కారం కాలేదు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం తెలంగాణలోనూ కొనసాగుతోంది. వ్యవసాయం చేయనీయకుండా గిరిజనులను వారి భూముల నుంచి గెంటిస్తున్న ఘటనలు కోకొల్లలు ఉంటున్నాయి. దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకుంటున్న తమ భూముల్లో అధికారులు బలవంతంగా మొక్కలు నాటుతున్నారని ఆదివాసీలు లబోదిబోమంటున్నారు. చాలా రాష్ట్రాల్లో ఈ సమస్యకు పరిష్కారం ఉన్నా నిర్లక్ష్యం జాప్యం కారణంగా అటవీశాఖ అధికారులు ఆదివాసీల మధ్యన ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణం. 
అన్యాయంగా కావాలని కేసులలో ఇరికిస్తే న్యాయం చేయాలని పోరాడే వారు కేవలం పిడికెడు మందే ఉంటే చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది. న్యాయం కోసం 8 నెలలుగా ఢిల్లీ బార్డర్​లో పోరాడుతున్న రైతుల ఆత్మహత్యలు చావులకు స్పందించని ప్రభుత్వం.. తన నిర్వాకం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఫాదర్ స్టాన్ స్వామి పట్ల స్పందించి విచారం వ్యక్తం చేస్తుందనుకోవడం భ్రమే అవుతుంది. 1965లో జంషెడ్​పూర్ వచ్చి ఆదివాసీల గొంతుగా మారిన స్టాన్ స్వామి సేవలు దేశంలోని ఆదివాసీ ప్రాంతాల్లో చిరస్మరణీయం. భౌతికంగా ఆయన్ను పాలకులు దూరం చేసినా ఆయన జ్ఞాపకాలు చూపిన బాటను దూరం చేయలేరు.
అమర్ రహే స్టాన్ స్వామి..

అక్రమ కేసులతో ఏండ్ల నిర్బంధం
బలహీనుల హక్కుల కోసం పోరాడుతున్న వారిపై పోలీసులు, ప్రభుత్వ ఏజెన్సీలు కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం తప్ప ఆరోపణలను రుజువు చేయడం లేదు. ఏండ్ల తరబడి జైల్లో మగ్గిపోవడంతో నిందితుల కుటుంబాలు సర్వం కోల్పోయి పడుతున్న బాధలు ఎవరికీ పట్టవు. 23 ఏండ్లు జైల్లో ఉండి కేసు కొట్టేసిన తర్వాత బతికున్న శవంలా బయటికి వచ్చాడు నిస్సార్. 11 ఏండ్లు నిర్బంధం తర్వాత రుజువులు లేవని కేసు కొట్టేశారు.. బయటికి వచ్చేసరికి తండ్రి చనిపోయారు, కుటుంబం నాశనం అయిందంటాడు బషీర్ అహ్మద్. ఏడాదిన్నర జైల్లో ఉండి ఇటీవలే అఖిల్ గగోయ్ విడుదల అయ్యాడు. సిమితో సంబంధముందని అరెస్ట్ చేసిన 127 మంది నిందితులపై19 ఏండ్ల తర్వాత ఇటీవల రుజువులు లేవని కోర్ట్ కేసు కొట్టేసింది. నిందితుల్లో ఏడుగురు జైల్లోనే మృతిచెందారు. నలుగురు అనారోగ్యాల బారినపడ్డారు. 

                                                                                                                                                                              - ఎండీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్