- భార్య హత్య కేసులో జైలుకెళ్లిన భర్త
- అనాథాశ్రమంలో కూతురు, కొడుకు
- ప్రభుత్వం క్షమాభిక్ష ఇవ్వడంతో జైలు నుంచి విడుదల
జమ్మికుంట, వెలుగు: భార్యను హత్య చేసిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తి ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్షతో విడుదలై 14 ఏండ్ల తర్వాత పిల్లల చెంతకు చేరాడు. ఇన్నాళ్లూ అనాథలుగా ఆశ్రమంలో పెరిగిన పిల్లలను కలిసి కన్నీరుమున్నీరయ్యాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లి పరిధిలోని వెంకటేశ్వరపల్లికి చెందిన సోమ సారయ్య, సత్తెమ్మ దంపతులకు కుమార్తె పూజ, కుమారుడు బన్నీ ఉన్నారు.
కూతురు ఆరేళ్లు, కుమారుడు మూడేళ్ల వయసులో ఉన్న టైంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో కోపోద్రిక్తుడైన సారయ్య సత్తెమ్మను నెట్టివేయడంతో ఆమె కిందపడి చనిపోయింది. సారయ్యను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడంతో జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి సారయ్య పిల్లలు జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాథ శరణాలయం నిర్వాహకుడు గోపరాజు వీరస్వామి పర్యవేక్షణలో ఉన్నారు. సారయ్య కూతురు పూజ ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా, బన్నీ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.
సత్ర్పవర్తన కలిగిన ఖైదీలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో సారయ్య కూడా జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇంటికి వచ్చిన సారయ్య అనాథ శరణాలయానికి వెళ్లి తన పిల్లలను కలిసి కన్నీటి పర్యంతమయ్యాడు. తర్వాత పిల్లలిద్దరినీ ఆశ్రమ నిర్వాహకులు సారయ్యకు అప్పగించారు. అనంతరం సారయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్షతో ఇంటికి రావడం, పిల్లలను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.