49 ఏళ్ల వ్యక్తి తన 17 ఏళ్ల కూతురు నీట్ ఎగ్జామ్ రాస్తుంటే ఏం చేస్తాడు. కూతురును పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి..రాయడం పూర్తయ్యాక మళ్లీ ఇంటికి తీసుకొస్తాడు. కానీ ఖమ్మం జిల్లాలో అలా జరగలేదు. తండ్రి కూడా కూతురుతో కలిసి నీట్ పరీక్ష రాశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది.
ఖమ్మం పట్టణంలో రాయల సతీష్ పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్ కు డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అయితే సతీష్ బాబుకు మెడిసిన్ చదవాలని కల. పరిస్థితులు అనుకూలించకపోవడంతో 1997లో బీటెక్ పూర్తి చేసిన ఆయన.. ఆ తర్వాత కోచింగ్ సెంటర్ నడుపుతున్నాడు. అయితే నేషనల్ మెడికల్ కమిషన్ గతేడాది నీట్ అర్హత కోసం వయోపరిమితిని ఎత్తివేసింది. దీంతో సతీష్ బాబుకు ఆశలు చిగురించాయి.
ఇంటర్ లో చేరి..
45 ఏండ్లు దాటినా కూడా సతీష్ బాబు తన కలను నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఇంటర్మీడియట్ లో ఎంపీసీ కోర్సు చేశాడు. అయితే నీట్ పరీక్ష రాయాలి కాబట్టి.. ఇంటర్ లో జువాలజీ, బోటనీ సబ్జెక్టులకు హాజరు కావడానికి రాష్ట్ర ఇంటర్ బోర్డు నుంచి స్పెషల్ పర్మీషన్ తీసుకున్నాడు. 2023లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండీయర్ జువాలజీ, బోటనీ పరీక్షలు రాశారు. వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ పరీక్షల్లో పాస్ అవుతాననే ఆశతో సతీష్ బాబు..నీట్ పరీక్ష రాశాడు.
స్పూర్తిగా నిలవాలి...
నీట్ పరీక్షలో పాస్ కాకపోయినా పర్లేదు..కానీ యువతకు స్ఫూర్తిగా నిలవాలని అనుకుంటున్నట్టు సతీష్ బాబు తెలిపాడు. 2023లో నీట్ లో పాస్ అవ్వకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని మళ్లీ రాస్తానని చెప్పాడు. తండ్రి సతీష్ బాబుతో కలిసి నీట్‌కు హాజరుకావడం చాలా సంతోషంగా ఉందని అతని కూతురు స్వప్నిక చెబుతోంది. అటు సతీష్ పెద్ద కూతురు సాత్విక ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో బీడీఎస్ చదువుతుండటం గమనార్హం.