తండ్రులు, కొడుకులు.. పొలిటికల్ చక్రవర్తులు

ఇండియా లాంటి ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ప్రస్తుతం మన దేశాన్ని పొలిటికల్ రాజ వంశాలే డామినేట్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రాజ వంశాలు అంతరిస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పటికీ ప్రపంచంలో 44 మంది రాజులున్నారు. ఒకప్పుడు ఈ ప్రపంచంలో రాజుల సంఖ్య వందల్లో ఉండేది. 1952లో ఈజిప్టు రాజు ఫరూఖ్ ను ఈజిప్షియన్ మిలిటరీ పడగొట్టినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ‘‘త్వరలో, ప్రపంచంలో ఐదుగురు రాజులే ఉంటారు. ఇంగ్లాండ్ రాజు కాకుండా పేకాట కార్డుల్లో నలుగురు రాజులు ఉంటారు”అని చెప్పాడు. ఒరిజినల్‌‌ రాజులు కాకపోయినా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పొలిటికల్‌‌ చక్రవర్తులు రాజ్యాలు ఏలుతున్నారు.

ఒకప్పుడు మనదేశంలో కూడా వేలాది మంది రాజులు ఉండేవారు. ఇప్పుడు వారి స్థానాన్ని రాజకీయ రాజులు భర్తీ చేసేశారు. అంతేకాదు వీరు రాజవంశాలను కూడా సృష్టించుకున్నారు. అలాగే వీరి చుట్టూ వేలాది మంది వందిమాగధులు కూడా ఉంటున్నారు. రాజుల కాలంలో ఈ వందిమాగధులు, భట్రాజులు చక్రవర్తులను కీర్తించడమే కాదు.. వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అయితే ఇప్పుడున్న పొలిటికల్ రాజులకు శాశ్వత నమ్మకస్తులంటూ ఎవరూ లేరు. పొలిటీషియన్లు అధికారంలో ఉన్నంత సేపు వందిమాగధులు వారి చుట్టూ ఉంటారు. ఒకసారి పవర్ పోయిందంటే వీరంతా మాయమైపోతారు. ఇప్పుడు సమస్య ఏమిటంటే.. దేశంలో ఎక్కువ భాగాన్ని, అలాగే ప్రతిపక్షాలను ఈ పొలిటికల్ రాజవంశాలే కంట్రోల్ చేస్తున్నాయి.

తమిళనాడు..
1969లో తమిళనాడు చీఫ్ మినిస్టర్ అన్నాదురై మరణించినప్పుడు ఆయన ప్లేస్​ను కరుణానిధి రీప్లేస్ చేశారు. ఆ వెంటనే కరుణానిధి చేసిన పని ఒరిజినల్ డీఎంకే లీడర్లను ద గ్రేట్ ఎంజీఆర్​తో పాటు పార్టీ నుంచి బహిష్కరించడం. అయితే కరుణానిధి అదృష్టం ఏమిటంటే ఆయన తన శత్రువులందరినీ మించి ఎక్కువ కాలం జీవించారు. 95 ఏండ్ల వయసులో కరుణానిధి చనిపోయే నాటికి ఆయన కొడుకు స్టాలిన్​కు ప్రతిపక్షం అనేదే లేదు. మన ఎలక్షన్ సిస్టంలో ఉన్న లోపాల సాయంతో కరుణానిధి డీఎంకేను ఒక రాజ వంశంగా మార్చారు. రాజకీయ పార్టీలకు సరైన రూల్స్ అమలు చేసి ఉంటే డీఎంకేపై స్టాలిన్​కు అసలు నియంత్రణ దక్కేది కాదు.

పంజాబ్..
అకాలీదళ్ వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ. ప్రకాశ్ సింగ్ బాదల్ 1970లో ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం ఆయన వయసు 96 ఏండ్లు. కరుణానిధి మాదిరిగానే తాను సీఎం అయిన తర్వాత బాదల్ ఒరిజినల్ అకాలీదళ్ లీడర్లందరిపైనా వేటు వేశారు. ప్రస్తుతం ప్రకాశ్​సింగ్ బాదల్ కొడుకు సుఖ్​బీర్​సింగ్​ అకాలీదళ్ ఓనర్.

ఉత్తరప్రదేశ్..
1989లో జనతాపార్టీ నుంచి ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ సీఎం అయ్యారు. ఆ తర్వాత మిగతా సీనియర్ జనతా పార్టీ లీడర్లందరినీ బయటికి పంపేశారు. ముఖ్యమంత్రిగా ఉండగానే సమాజ్​వాదీ పార్టీని స్థాపించారు. ఒక ముఖ్యమంత్రిగా, ఆయన పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. దానిని ఇప్పుడు ఒక రాజవంశంగా మార్చారు.

బీహార్..
లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ములాయం సింగ్ లాగే 1989లో జనతా పార్టీ నుంచి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. సీఎంగా ఉన్నప్పుడే, మిగతా జనతా పార్టీ లీడర్లందరినీ బయటకు పంపేసి, కొత్త పార్టీ పెట్టుకున్నారు. 1989 నుంచి లాలూ, ఆయన కుటుంబం బీహార్​లో పొలిటికల్ సామ్రాజ్యాన్ని నడిపిస్తోంది. ఈ లీడర్లందరూ ముఖ్యమంత్రులుగా పొలిటికల్ రాజ వంశాలను స్థాపించారు. అధికారాన్ని సంపాదించడానికి ఒక పార్టీని వాడుకుని, ఆ తర్వాత కొత్త పార్టీని ఏర్పాటు చేయడమో లేదా మిగతా లీడర్లను పార్టీ నుంచి పంపేయడమో చేశారు. పాత కాలంలో రాజులు తమ ప్రత్యర్థులను ఓడించడం లేదా చంపడమో చేసినట్టే ఇదంతా జరిగింది. దేవెగౌడ, శరద్​పవార్, మమతాబెనర్జీ ఇంకొందరికీ పొలిటికల్ రాజవంశాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ అయితే అతి గొప్ప రాజ వంశ పార్టీ. 1947 నుంచి నెహ్రూ–గాంధీ ఫ్యామిలీకే ఆ పార్టీపై కంట్రోల్ ఉంది. మధ్యలో పీవీ ఉన్నా.. 1996లో ఆయన ఓటమి తర్వాత మళ్లీ నెహ్రూ–గాంధీ ఫ్యామిలీ చేతుల్లోకి వెళ్లింది.

పార్టీలన్నీ డబ్బులున్నవే
రాజకీయ రాజవంశాలు తమ పార్టీలను మరింత డబ్బున్న వాటిగా మారుస్తున్నాయి. వీటికి డబ్బులు చెల్లించి పూర్తి స్థాయిలో పనిచేసే వర్కర్లు ఉంటున్నారు. ఒకవేళ వారు ఎన్నికల్లో ఓటమిపాలైనా, దాని ప్రభావం వాటిపై పడటం లేదు. గతంలో డీఎంకే ఎన్నికల్లో ఓడిపోయింది. కానీ అది ఆ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. మళ్లీ విజయం సాధించే వరకూ వారు రాజకీయాల్లో కొనసాగారు. ఎంజీఆర్ బతికి ఉన్నప్పుడు కరుణానిధి పదేండ్ల పాటు సీఎం సీటుకు దూరంగా ఉన్నారు. కానీ, ఎంజీఆర్ మరణించిన తర్వాత కరుణానిధి సీఎం అయ్యారు.

అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలె
పొలిటికల్ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నట్లయితే రాజకీయ రాజ వంశాలను నియంత్రించవచ్చు. ఎలక్షన్ కమిషనే ఆ పని చేయాలి. మరో సమస్య ఏమిటంటే.. పొలిటికల్ రాజ వంశాల లీడర్లు.. తమ ప్రత్యర్థులకంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. కరుణానిధి.. ఎంజీఆర్, జయలలిత వంటి వారందరినీ వెనక్కి నెట్టి 95 ఏండ్లు జీవించారు. ఇప్పుడు ఆ పార్టీకి శత్రువులే లేరు. ప్రకాశ్​సింగ్ బాదల్​కు ఇప్పడు 96 ఏండ్లు. ఇంకా యాక్టివ్​గానే ఉన్నారు. కానీ ప్రత్యర్థులు మాత్రం మిగలలేదు.

ఎలక్షన్‌‌ కమిషన్‌‌ రాజకీయ సంస్కరణలు తేవాలె

  • అన్ని పొలిటికల్ పార్టీలకూ ఎలక్షన్ కమిషన్ ఒకేరకమైన రూల్స్​ అమలు చేయాలి. ప్రతి రాజకీయ పార్టీకి ఓ భిన్నమైన రాజ్యాంగం ఉంటుంది. అలా కాకుండా ఒకే రకమైన రూల్స్ ఉంటే అన్ని పార్టీలకు ఒకరకమైన మెంబర్​షిప్ రూల్స్, అంతర్గత ప్రజాస్వామ్యం, అభ్యర్థుల సెలక్షన్ ప్రక్రియ ఉంటాయి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలన్నీ కూడా ఒకేరకమైన రూల్స్​ను ఫాలో అవుతున్నాయి. పొలిటికల్ పార్టీలకు అలా ఎందుకు ఉండకూడదు?
  • కరోనా కాలంలో రాజకీయ పార్టీలు ప్రజల జీవితాలను, మరణాలను నియంత్రిస్తాయని మనం చూస్తున్నాం. అందువల్ల, వారు ఒక ఎన్నికల్లో గెలిచిన తర్వాత, మన హక్కులను హరించకుండా చేయాలి. రాజకీయ పార్టీలు ప్రైవేట్ కంపెనీలు కాదు. వారి చర్యలు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటిని ఎన్నికల సంఘం మరింత మెరుగైన స్థాయిలో నియంత్రించాలి.
  • ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీల సభ్యుల జాబితాను కచ్చితంగా మెయిన్​టైన్ చేయాలి. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఇంటర్నల్​గా పార్టీ ఎన్నికలు నిర్వహించాలి. ఇది పారదర్శకత, నిజాయితీని పెంచుతుంది. ఇదే పద్ధతి అమెరికా, ఇతర దేశాల్లో అమలవుతోంది. సభ్యత్వ జాబితాలను సీక్రెట్​గా కాకుండా అందరికీ అందుబాటులో ఉంచాలి. ఇలాంటి వ్యవస్థే మనదేశంలో ఎందుకు లేదు?
  • ఇతర దేశాల్లో ప్రతి ఒక్కరు తమకు నచ్చిన పార్టీలో జాయిన్ కావచ్చు. ఏ లీడర్ వారిని ఆపడానికి లేదు. కానీ ఇండియాలో అలా ఎందుకు జరగడం లేదు?
  • పొలిటికల్ రాజ వంశాలను నియంత్రించడానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే.. అన్ని పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం, పారదర్శకత ఉండేలా చూడటమే. ఎన్నికల సంఘం సంస్కరణలు తీసుకొచ్చినప్పుడే ఇది సాధ్యపడుతుంది. 

తెలంగాణ భవిష్యత్‌‌ కాలమే చెప్పాలి
ఒక రాజవంశం అనేది ఒక నిర్ధిష్ట కాలం పాటు ఉండాలి. కరుణానిధి 55 ఏండ్లు, ప్రకాశ్​సింగ్​ బాదల్​ 50 ఏండ్లు, గాంధీ‌‌‌‌–నెహ్రూ కుటుంబం 
73 ఏండ్లు, ములాయం సింగ్​ యాదవ్ 30 ఏండ్లు, లాలూ ప్రసాద్​ యాదవ్​ 30 ఏండ్ల పాటు పవర్​ అనుభవించారు. అదే తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్​ ప్రస్తుతం ఏడేండ్లుగా అధికారంలో ఉన్నారు. కేసీఆర్​ గతంలో మినిస్టర్​గా పనిచేసినా అప్పట్లో ఆయన బాస్​ కాదు. ఇప్పటి వరకు అయితే భవిష్యత్​ను అంచనా వేయలేం. తెలంగాణలో పొలిటికల్​ రాజకుటుంబం ఏర్పాటవుతుందా? అనేది కాలమే చెప్పాలి. కొన్ని సార్లు అన్నీ ప్లాన్​ ప్రకారం నడిచిపోతాయి. కొన్నిసార్లు కాలం, ప్రకృతిపై ఇవన్నీ ఆధారపడతాయి.

- పెంటపాటి పుల్లారావు, పొలిటికల్​ ఎనలిస్ట్