అన్నదమ్ముల మధ్య గొడవ.. ఆగిన తండ్రి అంత్యక్రియలు

అన్నదమ్ముల మధ్య గొడవ.. ఆగిన తండ్రి అంత్యక్రియలు
  • మానకొండూరు మండలం వన్నారంలో ఘటన

కరీంనగర్, వెలుగు : అన్నదమ్ముల మధ్య గొడవ కారణంగా తండ్రి అంత్యక్రియలు రెండు రోజులుగా నిలిచిపోయాయి. ఈ ఘటన కరీంనగర్‌‌ జిల్లా మానకొండూరు మండలం వన్నారంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన జంగిలి కొమురయ్య (80), రాజకొమురవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు ఓదేలు, రవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజకొమురవ్వ మూడేండ్ల కింద చనిపోగా.. కొమురయ్య రెండో కుమారుడు రవి వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం కొమురయ్య చనిపోయాడు. 

విషయం తెలుసుకున్న పెద్ద కుమారుడు ఓదేలు తన తండ్రిని తమ్ముడు రవి హత్య చేశాడని అనుమానం వ్యక్తం చేస్తూ మానకొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులను చిన్నకుమారుడు రవి అడ్డుకొని తాను కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. దీంతో స్టేషన్‌‌కు వచ్చి పిటిషన్ ఇవ్వాలని చెప్పిన పోలీసులు.. కొమురయ్య డెడ్‌‌బాడీని కరీంనగర్‌‌ హాస్పిటల్‌‌కు తరలించారు. శుక్రవారం రాత్రి వరకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోస్టుమార్టం నిర్వహించలేదు. శనివారం వరకు ఎవరూ ఫిర్యాదు చేయకపోతే తామే సుమోటోగా కేసు నమోదు చేసి పోస్ట్‌‌మార్టం చేయిస్తామని మానకొండూరు సీఐ సంజీవ్‌‌ చెప్పారు.