
- జాగ్రత్తలు తీసుకోకుంటే ఫ్యూచర్లో ఇబ్బందులు
- ఏఐజీ హాస్పిటల్స్సర్వేలో ఆందోళనకర అంశాలు
- వివరాలు వెల్లడించిన సంస్థ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: దేశంలో ఒబేసిటీ సమస్య పెరుగుతున్నదని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే... ఫ్యూచర్లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వరల్డ్ ఒబేసిటీ డే సందర్భంగా గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో ‘బ్రేక్ ది వెయిట్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ మాట్లాడుతూ.. ఏఐజీ హాస్పిటల్ నిర్వహించిన సర్వేలో ఒబేసిటీ గురించి ఆందోళనకర విషయాలు బయటపడ్డాయన్నారు.
సర్కార్ స్కూల్ పిల్లల్లో 40 శాతం మంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్(ఏన్ఏఎఫ్ఎల్డీ)తో, 80 శాతం ఐటీ ఉద్యోగులు ఒబేసిటీతో
బాధపడుతున్నారని తెలిపారు. ఒబేసిటీ పశ్చిమ దేశాల సమస్య కాదని, మనదేశంలో ఈ సమస్య తీవ్రత క్రమంగా పెరుగుతుందన్నారు. దేశంలో 60 శాతం మంది ఒబేసిటీతో బాధపడుతున్నారని, 30 శాతం మంది ఒబేసిటీకి చేరువలో ఉన్నారని తెలిపారు. జాగ్రత్తలు తీసుకోకపోతే.. హార్ట్, లివర్, కిడ్నీలు, లంగ్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఆహారపు అలవాట్లు, ఎన్విరాన్మెంట్, ఒత్తిడి తదితరాల ప్రభావంతో ఒబేసిటీ పెరుగుతుందన్నారు. పోలీసుల్లో ఫిట్ నెస్ మీద అవగాహన పెంచేందుకు ఫిట్ కాప్ యాప్ ను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఫిట్ కాప్ యాప్ లో 18 వేల మంది పోలీసులు రిజిస్టర్ అయి ఉన్నారని, 300 నుంచి 400 మంది పోలీసులు వివిధ రకాల వ్యాధులతో బాధపడుతన్నట్లు తెలిసిందన్నారు. ఒబేసిటీ సమస్య మానసిక సమస్యకు కూడా దారి తీస్తుందని, మానసిక, శారీరక రెండు సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.