- ఎంపీ రాములు సైలెన్స్
- నేడు ఎన్నికల ప్రచార సభకు కేసీఆర్
నాగర్ కర్నూల్, వెలుగు: అచ్చంపేట నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలవాలని ఆశపడుతున్న గువ్వల బాలరాజుకు ప్రజలు అనుకూలమైన తీర్పు ఇస్తారా? లేదా? అనే చర్చ అధికార పార్టీలో కొనసాగుతోంది. తన మాటతీరుతో ఇంటా బయట శత్రువులను తయారు చేసుకున్న గువ్వల వైఖరి నచ్చక జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, సీనియర్ లీడర్లు ఒక్కక్కరూ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతుండగా, నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ఎంపీ రాములు కొడుకు కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్ ను అచ్చంపేటలో తిరగకుండా కట్టడి చేయాలని గువ్వల మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయన భరత్‌ను తిరగకుండా చూశారు. గువ్వలకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎంపీకి సూచించారు. ఇదిలా ఉంటే ఎంపీ ముఖ్య అనుచరులుగా ముద్రపడిన వారు కూడా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే అచ్చంపేట, ఉప్పునుంతల జడ్పీటీసీలు మంత్రియా నాయక్, అనంత ప్రతాప్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకురావడంలో జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ చక్రం తిప్పారు.
అలర్ట్ చేస్తున్న హై కమాండ్..
ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, బీఆర్ఎస్ అభ్యర్థులపై ఉన్న అసమ్మతిపై సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రికేటీఆర్ రిపోర్ట్స్ ముందుంచుకొని అభ్యర్థులతో మీటింగ్ పెడుతున్నారు. కేటీఆర్మొదటి రౌండ్లో నిర్వహించిన మీటింగ్‌లలో కల్వకుర్తి, అచ్చంపేట, జడ్చర్లతో పాటు మరికొన్ని నియోజకవర్గాలు ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ వ్యతిరేకత, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, వారి వ్యవహార శైలి కొంప ముంచుతాయన్న భయంతో ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో తొలి ప్రచారసభకు అచ్చంపేటను ఎంచుకున్నారు. గురువారం అచ్చంపేటలో ఎన్నికల శంఖారావం సభ నిర్వహిస్తున్నారు. సీఎం ప్రచార సభకు జనాలను తరలించేందుకు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల బాధ్యులకు గువ్వల బాధ్యతలు అప్పగించారు. పనిలో పనిగా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు.
ALS0 READ: బీఆర్ఎస్ నుంచి ఆగని వలసలు .. కాంగ్రెస్ గూటికి రూలింగ్ పార్టీ క్యాడర్
మాట తీరు నచ్చకనేనా?
కార్యకర్తలకు సపోర్ట్‌గా ఉంటాడనే పేరున్న గువ్వల బాలరాజు నల్లమల ఏరియా అభివృద్ధికి ఫండ్స్ తీసుకొచ్చినా, తనదే పైచేయిగా ఉండాలనే దుందుడుకు వైఖరి,మాటతీరుతో అటు అధికారులు, ఇటు పార్టీ నాయకులు, కార్యకర్తలను దూరం చేసుకున్నారనే విమర్శలున్నాయి. ఎన్నికల వేళ పార్టీలో కీలక నేతలు ఒక్కొక్కరూ కాంగ్రెస్‌లో చేరుతుండగా, వాళ్లే మళ్లీ తిరిగి వస్తారంటూ గువ్వల చేస్తున్న కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
కారు దిగిన నేతలు..
అచ్చంపేట జడ్పీటీసీ మంత్రియా నాయక్, వైస్ ఎంపీపీ అమరావతి, మార్కెట్ మాజీ చైర్మన్ సీఎం రెడ్డి, అచ్చంపేట మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల లావణ్య వెంకటేశ్, రాములు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్ ప్రధాన అనుచరులు సతీశ్శరణ్ గౌడ్, యాదయ్య, రమేశ్, శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డి, నర్సిరెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉప్పునుంతల ఎంపీపీ తిప్పర్తి అరుణ రెడ్డి, జడ్పీటీసీ అనంత ప్రతాప్ రెడ్డి, ఎంపీటీసీ కవిత రెడ్డి, సర్పంచులు పార్టీ మారారు. మరికొందరు సర్పంచులు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది.