యాదిలో.. రాజకీయ బోధకుడు ఫజల్–ఇ–హుసేన్​

యాదిలో..  రాజకీయ బోధకుడు ఫజల్–ఇ–హుసేన్​

ఫజల్ – ఇ – హుసేన్ పంజాబీ ఫ్యామిలీలో పుట్టారు. ​ఆయన రెండు యూనివర్సిటీల నుంచి పట్టా పొందారు. వాటిలో ఒకటి పంజాబ్​ యూనివర్సిటీ. రెండోది కేం బ్రిడ్జి. తర్వాత ‘బార్​’ పిలుపునందుకుని పంజాబ్​లో ప్రాక్టీస్​ పెట్టారు. చాలా సంవత్సరాలపాటు పంజాబ్ యూనివర్సిటీ సెనేట్, సిండికేట్​ రెండింట్లో సభ్యుడిగా ఉన్నారు. లెజిస్లేటివ్​ ఆఫ్​ కౌన్సిల్​లో యూనివర్సిటీ ప్రతినిధి కూడా. మోంటాగ్ – ఛెమ్స్​ఫర్డ్​ సంస్కరణలు ప్రారంభం కావడం ఆయన కెరీర్​కి టర్నింగ్ పాయింట్​ అయింది. ఆ సంస్కరణలు సరికాదని ఎలుగెత్తి చాటారు. భారతీయులు బాధ్యతలకు వెరువరని నిరూపించే సమయమిది. అన్ని జాతులు, వర్గాల వారు నూతన భారతదేశ సమృద్ధికి పాటుపడాలని ప్రోత్సహించే తరుణమది. 

దృఢ విశ్వాసాలు కలిగిన ఫజల్​కు అధికార వర్గాల నుంచి మద్దతు లభించింది. పంజాబ్​ ప్రజల అభివద్ధి కోసం ఆయన ఎంతో కృషిచేశారు. ఆయన అనుయాయుల పట్ల కూడా ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. ఫజల్​ రాజకీయ బోధకుడిగా పేరుగాంచారు. ఆయన బోధనల వల్ల ఇండియాలో ఎక్కడాలేని విధంగా పంజాబ్​లో రాజకీయ ఆలోచన, వాస్తవికత పెంపొందాయి. ఫజల్ రాజకీయాల్లో విజయం సాధించడానికి కారణం చర్చలకు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండడమే. తనకేమి కావాలో అన్నదానిమీద స్పష్టంగా ఉంటారు. సంభాషణను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట. లెజిస్లేచర్​ డిబేటింగ్​లో ముఖ్యపాత్ర పోషించేవారు. ఇంకా చెప్పాలంటే ఏ చర్చ దేనికి దారితీస్తుందో ముందుగానే గ్రహించగల నేర్పరి. దీంతోపాటు తరచూ కింది స్థాయి కార్యకర్తలతో సమావేశమయ్యేవారు. 

విద్యావ్యవస్థలో పెను మార్పులు

1921లో ఆయన పంజాబ్​ విద్యాశాఖామంత్రి అయ్యారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆయన ‘రెవెన్యూ మెంబర్’గా బదిలీ అయ్యారు. ఆ తర్వాత గవర్నమెంట్​ ఆఫ్ ఇండియాలో ఐదేండ్ల పాటు ‘ఎడ్యుకేషనల్ మెంబర్​’గా ఉన్నారు. అలా ఉన్నతమైన పదవులలో15 ఏండ్ల పాటు సేవలందిచారు. విద్యావిధానంలోనూ వెనుకబడిన ప్రాంతాలు, వర్గాలను ఎంకరేజ్ చేసేవారు. అలాగే తమ వర్గం వాళ్ల పిలల్ని పబ్లిక్​ స్కూళ్లకు, కాలేజీలకు పంపేలా ప్రోత్సహించారు.  

ఒక విధంగా విద్యావ్యవస్థలో పెను మార్పులకు కారణమయ్యారు. ఆయన చొరవతో మిడిల్​ స్కూళ్ల సంఖ్య పెరిగింది. వాటికి పొలాలను అనుసంధానించారు. ఉపాధ్యాయులకు వ్యవసాయంలో శిక్షణ ఇచ్చారు. బోధనా విధానాన్ని గ్రామీణ పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా రూపొందించారు.1936లో ఆయన రిటైర్ అయ్యాక, తన సొంతూరు లాహోర్​కు వెళ్లారు. అక్కడ సంస్థానం రాజకీయాల్లో లీనమయ్యారు. మరికొంతకాలం ఆయన జీవించి ఉంటే పంజాబ్​  మొదటి ‘ప్రీమియర్’ పదవి పొంది ఉండేవారు. 

వ్యక్తిత్వంలో..

వ్యక్తిత్వం పరంగా మంచి పేరున్న వ్యక్తి. ఎన్నో సందర్భాల్లో ఆయన ఔన్నత్యాన్ని, సహనాన్ని, దాతృత్వాన్ని ప్రదర్శించారు. ఓపిక, శ్రద్ధ, సూక్ష్మబుద్ధి కలవారు. ఆయన అవిశ్రాంత యోధుడు. కాకపోతే కాస్త రిజర్వ్​డ్​గా ఉండేవారు. ఆయనకు దగ్గరి స్నేహితులు చాలా తక్కువ. ఆయన చిన్న వయసులోనే అనారోగ్యం కారణంగా మంచాన పడ్డారు. ఆయన ఆఖరిరోజుల్లో తన ఇంటిని వదిలిపెట్టలేదు. అనారోగ్యంగా ఎవరి సాయమూ కోరలేదు. అయితే చివరివరకు ఇండియా డెవలప్​మెంట్​కు ప్రణాళికలు వేయడం, ముఖ్యంగా తాను సేవలందించిన సంస్థానంలో గడపడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం.

- మేకల మదన్​మోహన్​ రావు రిటైర్డ్​ హెడ్​ మాస్టర్