
వాషింగ్టన్: ఉత్తర అమెరికా డొమినికన్ రిపబ్లిక్‌లోని పుంటా కానాలో తప్పిపోయిన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోనంకి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సుదీక్ష తప్పిపోయి ఆరు రోజులు కావస్తోన్న ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో యూఎస్ ప్రభుత్వ సంస్థ ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది. సుదీక్ష రెస్య్కూ ఆపరేషన్లో ఎఫ్‌బీఐ జాయిన్ అయినట్లు మంగళవారం (మార్చి 11) అధికారులు వెల్లడించారు. సుదీక్ష ఆచూకీ కోసం ఎఫ్‌బీఐ వేట మొదలు పెట్టిందని తెలిపారు.
మరోవైపు.. సుదీక్ష మిస్సింగ్‌పై డొమినికన్ అధ్యక్షుడు లూయిస్ అబినాదర్ స్పందించారు. ‘‘సుదీక్ష తప్పిపోవడం పట్ల మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము. ఆమెను కాపాడేందుకు ప్రతి ప్రభుత్వ సంస్థ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటుంది’’ అని తెలిపారు. పర్యాటకుల భద్రత మా బాధ్యత అని.. కానీ ఈ ఘటన ఆందోళన కలిగించిందని అన్నారు. బీచ్ అలలకు సుదీక్ష కొట్టుకుపోయి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
కాగా, సుదీక్ష ప్రస్తుతం పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతోంది. భారత్‌కు చెందిన సుదీక్ష తల్లిదండ్రులు అమెరికాకు వలస వెళ్లి యూఎస్‌లో స్థిరపడ్డారు. సమ్మర్ హాలీ డేస్ నేపథ్యంలో మార్చి 6న ఫ్రెండ్స్‌తో కలిసి డొమినికన్ రిపబ్లిక్‌లోని బీచ్ రిసార్ట్‌కి వెళ్లింది సుదీక్ష. ఈ క్రమంలోనే సుదీక్ష బీచ్‌లో అదృశ్యమైంది. ఫ్రెండ్స్ ద్వారా విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సుదీక్ష కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుదీక్ష బీచ్‌కు వెళ్లిన సమయంలో పెద్ద ఎత్తున అలలు వచ్చాయని.. ఈ అలల్లోనే ఆమె కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతుండటంతో.. ఈ మేరకు అధికారులు బీచ్‌లో గాలిస్తున్నారు. ఆరు రోజులు అయిన ఆచూకీ లభించకపోవడంతో ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది.