వాషింగ్టన్ డీసీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన దాడికి సంబంధించి ఎఫ్బీఐ కీలక విషయాన్ని వెల్లడించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయనపై జరిగిన దాడిలో చెవికి తగిలింది రైఫిల్ నుంచి వెళ్లిన బుల్లెట్ అని ఎఫ్బీఐ నిర్ధారించింది. ఆ బుల్లెట్కు సంబంధించిన కొన్ని ముక్కలు ట్రంప్ చెవిలో ఇరుక్కుపోయినట్లు తెలిపింది. ప్రస్తుతం ఎఫ్బీఐ డైరెక్టర్గా కొనసాగుతోంది 2017లో ట్రంప్ నామినేట్ చేసిన క్రిస్టోఫర్ వ్రే కావడం గమనార్హం. ట్రంప్పై జరిగిన హత్యాయత్నం దాడికి సంబంధించిన కేసు విచారణపై వ్రే సమీక్ష జరిపారు. థామస్ క్రూక్స్ అనే 20 ఏళ్ల యువకుడు జులై 13న పెన్సిల్వేనియాలో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనను టార్గెట్ చేసి రైఫిల్తో కాల్చిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ట్రంప్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన కుడి చెవికి గాయమైంది. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న ట్రంప్పై కాల్పులు జరగడంతో ఈ ఘటన సంచలనం రేకెత్తించింది.
ఇదిలా ఉండగా.. మాజీ అధ్యక్షుడు ట్రంప్కు జరిగిన చికిత్సకు సంబంధించి హాస్పిటల్ నుంచి ఎలాంటి మెడికల్ రికార్డ్స్ను విడుదల చేయలేదు. ట్రంప్ పై దాడి జరిగిన అనంతరం.. ఆయనకు నిజంగా బులెట్ తగిలిందో, లేదో అనే అనుమానాన్ని ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే వ్యక్తం చేశారు. ఎఫ్బీఐ డైరెక్టరే ఈ అనుమానాన్ని వ్యక్తం చేయడంతో ట్రంప్పై కుట్ర సిద్ధాంతాలు తెరపైకొచ్చాయి. పక్కా ప్లాన్ ప్రకారం ట్రంప్ పన్నిన కుట్రలో భాగంగా దాడి జరిగిందని, అవకాశవాద రాజకీయాలకు ట్రంప్ తెరలేపారని ఆయనపై ప్రత్యర్థుల నుంచి విమర్శలొచ్చాయి. ట్రంప్కు తగిలింది బులెటేనని, ఆయన చెవిలో బులెట్ ముక్కలు ఉన్నాయని తాజాగా ఎఫ్బీఐ డైరెక్టరే ప్రకటించడం గమనార్హం. ఎఫ్బీఐ చేసిన ఈ ప్రకటనపై డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఎఫ్బీఐ డైరెక్టర్ వ్రే నుంచి తాము పొందిన క్షమాపణగా ఈ ప్రకటనను చూస్తున్నామని, మనస్పూర్తిగా ఆయనను క్షమిస్తున్నామని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా వ్రేపై విమర్శలు చేశారు. కాల్పుల వీడియోను తామంతా స్పష్టం చూశామని, అధ్యయనం చేశామని, అన్ని కోణాల నుంచి తరచితరచి పరిశీలించి చూసిన తర్వాత ట్రంప్ చెవి మీదుగా బులెట్ వెళ్లిందని నిర్ధారించుకున్నామని జాన్సన్ తెలిపారు.