వర్జీనియా: అమెరికా వర్జీనియాలోని ఓ ఫామ్ హౌస్ లో 150 పైప్ బాంబులను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) స్వాధీనం చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో బాంబులను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని ఎఫ్ బీఐ తెలిపింది. ఈ ఫామ్ హౌస్ ఓనర్ బ్రాడ్ స్పాఫోర్డ్ అక్రమంగా తుపాకీ కలిగి ఉన్నారనే ఆరోపణలతో పోయినేడాది డిసెంబర్ మొదటి వారంలో వాషింగ్టన్ లో అరెస్టు చేశారు. ఈ
నేపథ్యంలో అదే నెల 20న వర్జీనియాలో ఆయనకు ఉన్న 20 ఎకరాల ఫామ్ హౌస్ లో ఎఫ్ బీఐ తనిఖీలు చేపట్టింది. అక్కడ బాంబులను తయారు చేస్తున్నట్టు గుర్తించింది. 150 పైప్ బాంబులతో పాటు వాటిని తయారు చేసేందుకు అవసరమైన సామగ్రిని స్వాధీనం చేసుకుంది. అక్కడి ఫ్రిజ్ లో పేలుడు పదార్థాలను స్టోర్ చేసినట్టు, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బాంబులను ఓపెన్ గ్యారేజీలో దాచిపెట్టినట్టు గుర్తించింది. ఈ విషయాలన్నీ కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీట్ లో పేర్కొంది.