లక్ష్యానికి దూరంగా ఎఫ్​డీసీ.. 48 ఏండ్లుగా ఎకరా కౌలు రూ.8 వేలు మాత్రమే

  • సంస్థ చేతిలో 62,361 ఎకరాల అటవీ భూములు 
  • కోట్ల లాభాలు వస్తున్నా ఆదివాసీలకు ఉపాధి చూపట్లే
  • కొన్నేండ్లుగా పర్యావరణానికి  నష్టం కలిగించే చర్యలు
  • వెంటనే వెనక్కి తీసుకోవాలంటున్న గిరిజన సంఘాలు
  • భూమిలేని అడవి బిడ్డలకు కౌలుకు ఇవ్వాలనే డిమాండ్లు

భద్రాచలం, వెలుగు: ఫారెస్ట్ అండ్​ ట్రైబల్​డెవలప్​మెంట్​పేరుతో తెలంగాణలోని వేల ఎకరాల అటవీ భూములను గుప్పిట పెట్టుకున్న ఎఫ్ డీసీ(ఫారెస్ట్​డెవలప్​మెంట్ కార్పొరేషన్).. ఏటా కోట్లాది రూపాయాల లాభాలను తన ఖాతాలో వేసుకుంటూ అసలు లక్ష్యాలను గాలికి వదిలేసింది. అడవుల అభివృద్ధినిగాని,  వన్యప్రాణుల సంరక్షణను గాని, గిరిజన ఆవాసాలను, వారి ఉపాధి అవకాశాలను కనీసం పట్టించుకోవడం లేదు. పైగా ఎఫ్​డీసీ వేస్తున్న పంటలతో అడవుల్లో జీవవైవిధ్యం దెబ్బతింటోందని ఎక్స్​పర్ట్స్​హెచ్చరిస్తున్నారు.  దీంతో ఈ భూములను వెంటనే వెనక్కి తీసుకొని, భూమిలేని అడవి బిడ్డలకు కౌలుకు ఇవ్వాలని గిరిజన సంఘాలు డిమాండ్​చేస్తున్నాయి.

1972లో రాష్ట్రంలోని 62,361.98 ఎకరాల అటవీ భూములను ఎఫ్​డీసీ లీజుకు తీసుకుంది. వీటిలో జామాయిల్, వెదురు, జీడిమామిడి తోటలను సాగు చేస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే కౌలు. 48 ఏండ్లుగా ఎఫ్​డీసీ ఎకరానికి కేవలం రూ.8వేలు మాత్రమే చెల్లిస్తోంది. కారు చౌకకే కార్పొరేట్​సంస్థకు అటవీ భూములను ధారాదత్తం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పునరాలోచించాలని, వెంటనే భూములు వెనక్కి తీసుకోవాలని ఎన్​జీఓలు, ఆదివాసీలు, గిరిజనులు డిమాండ్​చేస్తున్నారు. భూమి లేని పేద రైతులకు కౌలుకు ఇవ్వాలని కోరుతున్నారు.

గిరిజన చట్టాలకు తూట్లు.. 

ఎఫ్​డీసీ ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలో 1/70, పీసా వంటి గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తూ వ్యాపారం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. అటవీ ప్రజలకు ఉపాధి చూపించడం లేదు. విద్య, వైద్యం కోసం రూపాయి ఖర్చు చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖ 62,361.98 ఎకరాల భూములను ఎఫ్​డీసీకి లీజుకు ఇవ్వగా, ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 27, 478.84 ఎకరాలు, మెదక్​డివిజన్​లో 5,352.50, కాగజ్​నగర్​లో 11,648.01, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి పరిధిలో10,470.50, జయశంకర్​భూపాల్​పల్లి, ములుగు, మహబూబ్​బాద్​పరిధిలో 7,412.13 ఎకరాలు ఉన్నాయి. వీటిలో ఎఫ్​డీసీ తమ సిబ్బందితో జామాయిల్, వెదురు, జీడిమామిడి తోటలు సాగు చేయిస్తోంది.

ఈ తోటల్లో పెద్దగా పని ఉండదు. కూలీలను పెట్టి మొక్కలు నాటిస్తారు. తాత్కాలికంగా నియమించుకున్న కొంత మంది ఉద్యోగులు పర్యవేక్షిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్​డీసీ పనుల పర్యవేక్షణకు 64 మంది వరకు సిబ్బంది ఉన్నారు. జామాయిల్, వెదురు, జీడిమామిడి పంటలు చేతికొచ్చాక టెండర్ల ద్వారా వాటిని అమ్ముతారు. ఆ ఆదాయం మొత్తం ఎఫ్​డీసీ ఖాతాలోకి పోతోంది. గిరిజన చట్టాల ప్రకారం అటవీ భూములను కేవలం ఆదివాసీలకే లీజుకు ఇవ్వాలి. కానీ అటవీశాఖ అవేం పట్టించుకోవడం లేదు. అదే ఆదివాసీలకు లీజుకు ఇస్తే సంప్రదాయ వ్యవసాయంతోపాటు, భూముల పరిరక్షణ సాధ్యమవుతుంది. కౌలు రూపంలో అటవీశాఖకు అధిక ఆదాయం వస్తుంది.

ఆదివాసీలకు ఉపాధి దొరుకుతుంది. అదే సమయంలో పోడు భూముల ఇష్యూ కూడా ఉండదు. ఈ నేపథ్యంలో ఆదివాసీ హక్కులు, సంస్కృతి, సంప్రదాయం, వనరుల పరిరక్షణ సమితి పేరిట ఆదివాసీలు, ఎన్జీఓలు ఏకమై ఇటీవల భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట తహసీల్దార్​ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కార్పొరేట్​సంస్థతో భూముల లీజును రద్దు చేసి, ఆదివాసీలకు కౌలుకు ఇవ్వాలని డిమాండ్​చేశారు. 

దెబ్బతింటున్న జీవవైవిధ్యం

అటవీ సంపదను, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, అటవీ ఉత్పత్తులతో సంపద సృష్టించడం అనే లక్ష్యాలతో అటవీశాఖ 48 ఏళ్ల కింద తన భూములను ఎఫ్​డీసీకి కేటాయించింది. లోకల్​ఆదివాసీలకు ఉపాధితోపాటు, అటవీ ఉత్పత్తులు, పచ్చదనం పెంచాలనేది అటవీశాఖ ప్రధాన ఉద్దేశం. కానీ ఎఫ్​డీసీ సాగుచేస్తున్న పంటలతో అడవుల్లో ఎలాంటి అభివృద్ధి జరగకపోగా, జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటోందని పలు స్టడీస్​ చెప్తున్నాయి. ఉదాహరణకు జామాయిల్ సాగుతో భూగర్భ జలాలు దెబ్బ తింటున్నాయని, పశుపక్ష్యాదులకు  ఆవాసాలు లేకుండా పోతున్నాయని పర్యావరణవేత్తలు, జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జామాయిల్​చెట్లపై చూద్దామంటే ఒక్క పక్షి గూడు కూడా కనిపించదని, ఆ చెట్ల  నీడలో ఏ ఒక్క జంతువూ సేదదీరలేదని గుర్తుచేస్తున్నారు.  లాభాల కోసం ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడుతుండడంతో మిత్ర పురుగులు చనిపోయి బంగారం లాంటి భూములు ధ్వంసం అవుతున్నాయని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

తగ్గిపోతున్న అటవీ ఉత్పత్తులు

భద్రాచలం ఏజెన్సీలో అటవీ ఉత్పత్తులు నానాటికీ తగ్గిపోతున్నాయి. ఇప్ప పువ్వు సేకరణ లక్ష్యం ఏడాదికి 2 వేల క్వింటాళ్లు అయితే 450 క్వింటాళ్లకు మించి రావడం లేదని గిరిజన సహకార సంస్థ వాపోతోంది. ఇప్ప చెట్లు అంతరించిపోతుండడంతో ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్​ఇంటికో ఇప్ప మొక్క అనే స్కీముకు శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు అడవి ఉసిరి విరివిగా దొరికేది. ఇప్పుడు వాటి జాడ లేదు. పాల పండ్లు కూడా కనిపించడం లేదు. చింతపండు అరుదైపోతోంది. ఇటువంటి తరుణంలో గిరిజనులకు ఉపాధి కల్పించే ఈ చెట్లను ఎఫ్​డీసీకి లీజుకు ఇచ్చి న భూముల్లో నాటితే అడవుల అభివృద్ధితోపాటు పర్యావరణం పదిలంగా ఉంటుంది. 

మమ్మల్ని పనులకు పిలవట్లే

మా ఊరిలో ఎఫ్​డీసీ నర్సరీ ఉంది. అందులో పనులకు మమ్మల్ని పిలవట్లే. కేవలం మహిళలనే రమ్మంటున్నారు. చెట్లు నరకడం, లోడింగ్​ఇతరత్రా పనులన్నింటికీ  కాంట్రాక్టర్లు ఛత్తీస్​గఢ్, ఒడిశా కూలీలను తీసుకొస్తున్నారు. మా ఊరి చుట్టూ జామాయిల్​తోటలే ఉన్నాయి. కానీ పనులు ఉండడం లేదు. జామాయిల్ తోటలతో పక్షులు, అడవి జంతువులు ఉండయ్​. 
అటవీ భూములను ఎఫ్​డీసీకి ఇవ్వడం వల్ల లోకల్ ఆదివాసీలకు ఒరిగిందేమీ లేదు.
- సత్యనారాయణ, మాదారం, ములకలపల్లి మండలం, కొత్తగూడెం జిల్లా 

అటవీ భూములను వెనక్కి తీస్కోవాలి

అటవీ భూముల్లో కార్పొరేట్​వ్యవసాయంపై ప్రభుత్వం పున: సమీక్ష చేయాలి. అటవీ భూముల కౌలు విధానం గిరిజన చట్టాలను గౌరవించేలా ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్ డీసీకి లీజుకు ఇచ్చిన వేల ఎకరాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆదివాసీలు, గిరిజనులకు న్యాయం చేయాలి. భూమిలేని గిరిజనులకు కౌలుకు ఇవ్వాలి.