పులులకు హాని చేయొద్దు : నీరజ్ కుమార్

  •     జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ నీరజ్ కుమార్ 
  •     బాధితులకు పరిహారం అందజేత

కాగజ్ నగర్, వెలుగు : పులులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, అంతరిస్తున్న పులులను రక్షించేందుకు అటవీ అధికారులకు సహకరించాలని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్, కాగజ్ నగర్ ఇన్​చార్జి ఎఫ్​డీఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ అన్నారు. ఇటీవల పెద్దపులి దాడిలో మృతిచెందిన 10 మంది పశువుల యాజమానులకు శనివారం పెంచికల్ పేట్ మండలంలోని రైతు వేదికలో రూ.లక్ష 16 వేల నష్టపరిహారం అందజేశారు.

ఈ సందర్భంగా డీఎఫ్ఓ మాట్లాడుతూ.. పులులను కాపాడేందుకు పకడ్బందీ ప్రణాళిక తయారు చేశామన్నారు. పశువులపై అటవీ జంతువులు దాడి చేస్తే ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని, పంచనామా చేయించి వెంటనే పరిహారం ఇస్తామని చెప్పారు. రైతులు పులులకు హాని చేయకుండా సంయమనం పాటించాలన్నారు. పశువులను కోల్పోయిన ఆవేశంలో ఎవరైనా పులికి హాని తలపెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డివిజన్​లోని పలు రేంజ్​ల్లోనూ ఆయా రేంజ్ ఆఫీసర్లు బాధితులకు పరిహారం అందించారు.