మహబూబ్‌నగర్, వెలుగు : ‘ఈరోజు సీఎం కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ నేతల సమావేశం సంతాప సభను తలపించింది.. కేసీఆర్ ముఖంలో భయం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది.. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ఆ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్ అయ్యింది.. తప్పు చేసినోళ్ల సంగతి తేలుస్తాం..’ అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ ఫంక్షన్ హాలులో జరిగిన ఉమ్మడి మహబూబ్‌నగర్--–రంగారెడ్డి–--హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ-, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ 'దొంగ దందాలు చేసే కేసీఆర్ బిడ్డ దీక్ష చేస్తే ఏమనాలి.. ఆమె ఎవరి కోసం దీక్ష చేసింది.. దొంగ సారా దందా చేసినామే రద్రమదేవి, ఝాన్సీలక్ష్మీబాయి ఎట్లయితది? దొంగ సారా దందాకు వంద కోట్లు కేసీఆర్ బిడ్డకు ఎక్కడి నుంచి వచ్చినయ్? తెలంగాణ ఉద్యమానికి ముందు సొంత ఇల్లే లేదని చెప్పిన వాళ్లు, ఈ రోజు ఇంద్ర భవనాల్లో ఎట్లా ఉంటున్నరు? ఉద్యమ సమయంలో ఫైనాన్స్ పై కారు, ప్రచార రథం తీసుకున్న కేసీఆర్‌కు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినయ్?' అని సంజయ్ నిలదీశారు.
ఫస్ట్ తారీఖు జీతాలిస్తం ..
బీజేపీ అధికారంలోకి వచ్చినంక ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు జీతాలిస్తమని సంజయ్ అన్నారు. నెల రోజుల్లో డీఏలను, వెంటనే పీఆర్సీని అమలు చేస్తమని ప్రకటించారు. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్న ఉద్యోగ సంఘాల లీడర్లు ఏం చేస్తున్నారని సంజయ్ ప్రశ్నించారు. టీచర్లు, ఉద్యోగుల సమస్యలు ఎందుకు ప్రస్తావించరని, టీఏ, డీఏలు, బదిలీలు, ప్రమోషన్ల, 317 జీవోపైనా, రిటైర్డ్ ఉద్యోగుల బెన్ ఫిట్లపై ఎందుకు చర్చించలేదని నిలదీశారు. ‘టీఎన్జీవోస్ నాయకుల చిట్టా తీస్తున్నా.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి చూస్తా..' అని హెచ్చరించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ప్రాంతానికే పరిమితం కాదని, తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలు కాబోతున్నాయన్నారు. తెలంగాణ ప్రజలంతా మీరిచ్చే తీర్పు కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఏ సర్వే చూసినా బీజేపీ బలపర్చిన ఏవీఎన్ రెడ్డి గెలుస్తారని నివేదికలు వస్తున్నాయన్నారు. ఏవీఎన్ రెడ్డి గెలవకపోతే కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కుతుందన్నారు. ఈ నెల 13న జరిగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ రెడ్డిని గెలిపించాలని సంజయ్ కోరారు.
చాక్‌పీసులకూ డబ్బుల్లేవ్..
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ సర్కారు బడుల్లో చాలా సమస్యలున్నాయని, చాక్‌పీసులకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఉందన్నారు. జేఏసీలోని నలుగురు లీడర్లను ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకొని ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. పాలమూరు సహా అన్ని వర్సిటీలను కాంట్రాక్ట్ లెక్చరర్లతోనే నడిపిస్తున్నారు తప్ప, పది శాతం కూడా రెగ్యులర్ ఉద్యోగులు లేరని గుర్తు చేశారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏ ఆకాంక్షతో తెలంగాణ నెరవేర్చుకున్నారో, ఆ ఆకాంక్షల సాధన కోసం బీజేపీ పోరాడుతుందన్నారు. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డిని యూనియన్లకు అతీతంగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
బంగారమంతా కేసీఆర్ ఇంట్లోనే..
పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఇక్కడి ప్రజల బతుకులు బంగారమవుతాయని ఆశించామని, కానీ కేసీఆర్ కుటుంబమే బంగారుమయం అయిందని విమర్శించారు. టీచర్ల తరపున గళమెత్తే అభ్యర్థిగా ఏవీఎల్ఎన్ రెడ్డిని నిలబెట్టామని, ఆయనకు ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ స్టేట్ట్రెజరర్ బండారి శాంతికుమార్, మాజీ మంత్రి చంద్రశేఖర్, డోకూరు పవన్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు నాగూరావు నామోజీ, రతన్ పాండురంగారెడ్డి పాల్గొన్నారు.
వీ6ను బ్యాన్ చేస్తే ఉరికించి తంతరు..
వీ6' చానల్, 'వెలుగు' పేపర్‌ను బ్యాన్ చేస్తారట.. దమ్ముంటే చేయ్ బిడ్డా.. నీ సంగతి చూస్తా.. గతంలో ఏబీఎన్, టీవీ9ను బ్యాన్ చేస్తే ప్రజలంతా వ్యతిరేకించిన్రు.. ఈసారి 'వీ6-వెలుగు'ను బ్యాన్ చేస్తే తెలంగాణ ప్రజలంతా రోడ్డు మీదకి ఎక్కి బీఆర్ఎస్ నేతలను ఉరికించి కొడతరు.. వీ6 వెలుగును కాదు, నీ ప్రభుత్వాన్ని రద్దు చేసే రోజులు రాబోతున్నయ్' అని సంజయ్ హెచ్చరించారు.