
నవాబుపేట, వెలుగు: మూడు రోజులుగా చిరుతలు సంచరించడంతో మండలంలోని యన్మన్గండ్ల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ సమీపంలోని దేవరగుట్ట పరిసరాల్లో సంచరిస్తున్న రెండు చిరుతలు ఆదివారం రాత్రి వ్యవసాయ పొలాలు, పశువుల షెడ్లు, ఇటుక బట్టీల వద్ద కాపలాగా ఉన్న నాలుగు పెంపుడు కుక్కలను చంపేశాయి. సోమవారం ఉదయం దేవరగుట్టపై చిరుతలు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు.
మూడు రోజులుగా పొలాల వద్దకు వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోంది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేశ్ చిరుతలు సంచరిస్తున్న ప్రాంతాన్ని, పొలాల్లో ఆనవాళ్లు సేకరించి రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. దేవరగుట్ట సమీపంలో బోన్లను ఏర్పాటు చేసి చిరుతలను తరలించాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.