![బీఆర్ఎస్ను వెంటాడుతున్న ఓటమి భయం!](https://static.v6velugu.com/uploads/2025/02/fear-of-defeat-haunting-brs-as-pink-party--keep-off-mlc-polls_Ml1Z30DmAX.jpg)
ప్రత్యేక తెలంగాణ ఉద్యమకాలం నుంచి పదేళ్లు అధికారంలో ఉన్నంతకాలం వరకూ... ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైనా సరే, లేదంటే కోరి మరీ ఉప ఎన్నికలు తెచ్చుకొని గెలుపు, ఓటమిలను ఏమాత్రం లెక్కచేయక దూకుడుగా వ్యవహరించేది గులాబీ పార్టీ. కానీ, కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చతికిలపడిపోయింది. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, బీఆర్ఎస్ను ఓడించి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని గులాబీ దళపతి కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ, చేతలు మాత్రం ఫామ్ హౌస్ గేటు దాటడం లేదు.
రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. అందులో రెండు ఉత్తర తెలంగాణలో 42 నియోజకవర్గాలను కవర్ చేసే ఉమ్మడి ఆదిలాబాద్-, నిజామాబాద్, -కరీంనగర్, -మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలు. మరొకటి దక్షిణ తెలంగాణలో 33 నియోజకవర్గాలను కవర్ చేసే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, -నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం. రాష్ట్రవ్యాప్తంగా 75 నియోజకవర్గాల పరిధిలో జరగబోయే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్కు అత్యంత కీలకమైనవి. అంతేకాదు, వీటిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కేసీఆర్‌తో సహా ఆయన కొడుకు కేటీఆర్, బిడ్డ కవిత, అల్లుడు హరీష్‌రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ పోటీ చేస్తుంటే, ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కారణం పరోక్షంగా బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్ ఎంచుకున్న రాజకీయ వ్యూహమా? లేదంటే పోటీ చేసినా ఓడిపోతామని లోలోపల భయమా?
సన్నాసుల మఠమా?
తమ పార్టీది సన్నాసుల మఠం కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించుకున్న కేసీఆర్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను నిలబెట్టకపోవడం రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. కేసీఆర్ చెబుతున్నట్లు కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజల్లో నిజంగా వ్యతిరేకత ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు? ఈ ఎన్నికలు తమ పార్టీకి అనుకూలంగా మలుచుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది? ఇప్పటికిప్పుడు తమ పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలత లేదని కేసీఆర్ భావిస్తున్నారా? నిజమే కావచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తే ఎమ్మెల్సీ స్థానాలు గెలవడం కాదు, కనీసం కాంగ్రెస్, బీజేపీలకు గట్టిపోటీ ఇవ్వగలదా? నిజంగా పోటీ ఇవ్వలేకపోతే భవిష్యత్‌లో పార్టీ అత్యంత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఖాయమని కేసీఆర్ ఓ అంచనాకు వచ్చి, వ్యూహాత్మకంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారా?
కాంగ్రెస్, బీజేపీల మధ్యనే పోటీ
రాష్ట్రంలో జరిగే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్-, నిజామాబాద్, -కరీంనగర్, -మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసింది. మిగిలిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో మిత్రపక్ష అభ్యర్థులకు కాంగ్రెస్ పరోక్షంగా మద్దతు తెలపనుంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టభద్రులు, ఉపాధ్యాయులలో కొంత మేర ఓటర్లు ఉన్నారు. వాళ్లిప్పుడు ఏ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేస్తారు? కాంగ్రెస్ అభ్యర్థులకు వాళ్లు ఎలాగూ వేయరు. కనుక పరోక్షంగా వాళ్ల ఓట్లను బీజేపీ అభ్యర్థులకు వేసి గెలిపించేలా ఫామ్ హౌస్‌లో కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నాడా? నిజంగా అదే జరిగితే, కేసీఆర్ ఎంచుకున్న వ్యూహాత్మక ఉచ్చులో బీఆర్ఎస్ బలిపశువు కాక తప్పదు.
కేసీఆర్ పట్ల తగ్గని వ్యతిరేకత
విద్యావంతులు, మేధావి వర్గాలైన పట్టభద్రులు, ఉపాధ్యాయులు సమాజంపై ప్రభావం చూపగలిగే మేధావి వర్గాలే! గత పదేళ్ళలో కేసీఆర్ ఈ రెండు వర్గాలను పూర్తిగా విస్మరించారు. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం, నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోవడం వంటివి కారణమైతే ఉపాధ్యాయుల బదిలీలు చేయకపోవడం, ప్రమోషన్లు ఇవ్వకపోవడం, పీఆర్సీ బకాయిలు చెల్లించకపోవడం, అనాలోచితంగా జారీ చేసిన జీవో నెం.317, 46 పట్ల ఉపాధ్యాయులు, ఉద్యోగుల్లో కేసీఆర్ పట్ల వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. 55 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన క్రెడిబిలిటీ రేవంత్ ప్రభుత్వానికి ఉంది.
బీఆర్ఎస్ బలహీనతే.. బీజేపీకి ఊతం
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసిన 17 స్థానాల్లో ఓటమిపాలైంది. మొత్తం 17 స్థానాల్లో 8 చోట్ల కాంగ్రెస్, మరో 8 చోట్ల బీజేపీ ఘన విజయం సాధించింది.14 స్థానాల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది. ఖమ్మం, మహబూబాబాద్ లో మాత్రం రెండో స్థానంలో నిలిచింది. ఇక హైదరాబాద్ స్థానంలో అయితే నాలుగో స్థానానికి పరిమితమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ 39.40 శాతం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో 40.10 శాతం ఓట్లు పెంచుకోగలిగింది. కానీ, బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో 37.35 శాతం ఓట్లు సాధించి, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 16.68% శాతానికి పడిపోయింది. అదే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో 13.90 ఓట్ల శాతం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో అమాంతం 35.08 శాతానికి పెంచుకోగలిగింది. లోక్‌సభ ఎన్నికల్లో ఒకరి నష్టం మరొకరికి లాభం అనే పదబంధం బీఆర్ఎస్ విషయంలో అక్షరాల నిజమైంది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇంతటి ఘోర పరాభావానికి లిక్కర్ కేసులో కవిత జైలు పాలు కావడం, పేపర్లు లీకేజీ, కాళేశ్వరం కుంభకోణం, విద్యుత్ కొనుగోలు కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, భూకబ్జాలు, అవినీతి ఆరోపణలు బీఆర్ఎస్ ప్రతిష్టను బాగా దిగజార్చాయి. దాంతోపాటు కేసీఆర్ నియంత పోకడలు ప్రజలకు ఏమాత్రం మింగుడు పడలేదు.
బీజేపీ బలపడడానికి పరోక్షంగా కేసీఆర్ పునాదులు
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ను రాజకీయంగా దెబ్బ తీయడం కోసం ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడడానికి పరోక్షంగా కేసీఆర్ పునాదులు వేశాడన్నది కఠోర వాస్తవం. కేసీఆర్ హయాంలో చేసిన అవినీతి, అక్రమాలను బీజేపీ ఆయుధంగా మలుచుకొని కేసీఆర్ ను తన గుప్పిట్లో పెట్టుకుంది. రాజకీయంగా తెరమరుగైనా సరే, అవినీతి విషయాల నుంచి బయటపడాలనేదే నిజమైతే.. ఆయన చేసే రాజకీయమంతా తెలంగాణను మరోసారి మోసం చేయడమే. రాష్ట్రంలో బీజేపీ బలపడితే, బీఆర్ఎస్కు రాజకీయ పతనావస్థ తప్పదు.
ఓటముల వల్లే పోటీకి దూరమా?
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఉత్తర, దక్షిణ తెలంగాణలో విద్యావంతులు, మేధావి వర్గం ఓట్లను పొందలేకపోయింది. 2019లో జరిగిన ఆదిలాబాద్, -నిజామాబాద్, -కరీంనగర్, -మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన కె.రఘోత్తమ్ రెడ్డి చేతిలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన పాతూరి సుధాకర్ రెడ్డి ఓడిపోయారు. ఇక అదే స్థానానికి జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి గెలిచారు. బీఆర్ఎస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ గౌడ్ ఓడిపోయారు. గత ఏడాది ఖమ్మం, -వరంగల్, -నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇదే స్థానానికి జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పూల రవీందర్ ఓడిపోయారు.
కేటీఆర్ కామెంట్ హాస్యాస్పదం
అధికారంలో ఉన్నప్పుడే ఉపాధ్యాయ, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్న అనుభవాలతో ఓ అంచనాకు వచ్చిన కేసీఆర్ ఇపుడు అభ్యర్థులను నిలపలేదు. అలాంటపుడు, ‘కొడంగల్ అసెంబ్లీ స్థానానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి పోటీ చేస్తే.. మా నరేందర్‌రెడ్డి ఆయన్ను చిత్తుగా ఓడించడం ఖాయం’ అని కేటీఆర్ అంటున్నారు. ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీ చేయని బీఆర్ఎస్.. కొడంగల్‌కు ఉప ఎన్నిక వస్తే పోటీ చేసి గెలుస్తుందని చెప్పడం హాస్యాస్పదం.
- డా.చెట్టుపల్లి మల్లికార్జున్,
పొలిటికల్ ఎనలిస్ట్