- మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన హెచ్చరిక
బషీర్ బాగ్, వెలుగు: మున్నూరుకాపులకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన రాష్ట్ర అధ్యక్షుడు ఉగ్గే శ్రీనివాస్ పటేల్ డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మున్నూరుకాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా ఫెయిల్అయ్యారని, ఈ నెల 12న రేవంత్రెడ్డి ఇంటిని ముట్టడించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్న మున్నూరుకాపులకు మంత్రివర్గంలో చోటు కల్పించి, డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాచిగూడలోని మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహాన్ని ఎండోమెంట్ పరిధి నుంచి తొలగించి తిరిగి మున్నూరుకాపులకు అప్పగించాలని కోరారు. మున్నూరుకాపుల పేరు చివరన పటేల్ వచ్చేలా ప్రభుత్వం గెజిట్ రిలీజ్చేయాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలు జరపాలని, బీసీలకు మున్నూరుకాపులకు అధిక స్థానాలు కేటాయించాలని డిమాండ్చేశారు. రాష్ట్రంలో ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలన్నారు.