
యాదగిరిగుట్ట, వెలుగు : ఫిబ్రవరి 26న హైదరాబాద్ బర్కత్ పురలోని యాదగిరి భవన్ నుంచి బయల్దేరిన లక్ష్మీనారసింహుడి 'అఖండజ్యోతి' యాత్ర శనివారం రాత్రి యాదగిరిగుట్టకు చేరుకుంది. యాదగిరిగుట్టలో అఖండ జ్యోతి యాత్రకు భక్తులతో కలిసి యాదగిరిగుట్ట ఏసీపీ రమేశ్, రూరల్ సీఐ కొండల్ రావు మంగళహారతులతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. నారసింహుడి అఖండజ్యోతికి స్థానిక భక్తులు కొబ్బరికాయలు కొట్టి ఘనస్వాగతం పలికారు.
గుండ్లపల్లి నుంచి వైకుంఠ ద్వారం వరకు బతుకమ్మ ఆట ఆడుతూ మహిళలు సంబరాలు చేసుకున్నారు. బర్కత్ పులో మొదలైన అఖండజ్యోతి పాదయాత్ర వైఎంసీఏ నారాయణగూడ, విద్యానగర్, రామంతాపూర్, హబ్సిగూడ, ఉప్పల్, నారపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయగిరి మీదుగా యాదగిరిగుట్టకు చేరుకుంది. వైకుంఠ ద్వారం వద్ద లక్ష్మీనరసింహుల విగ్రహాలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి 10 గంటలకు రాయగిరి చెరువులో స్వామి అమ్మవార్ల విగ్రహాలను నిమజ్జనం చేశారు.