ఫిబ్రవరి 4 బీసీలకు పీడ దినం బీసీలకు అన్యాయం చేసే కుట్ర: మధుసూదనా చారి

ఫిబ్రవరి 4 బీసీలకు పీడ దినం బీసీలకు అన్యాయం చేసే కుట్ర: మధుసూదనా చారి
  • మరోసారి కులగణన చేయించాలి: గంగుల కమలాకర్​

హైదరాబాద్, వెలుగు: కులగణన సర్వే వివరాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఫిబ్రవరి 4.. బీసీలకు పీడదినమని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ మధుసూదనా చారి అన్నారు. బీసీ రిజర్వేషన్లను పెంచే బిల్లును ప్రవేశపెడతారని ఆశించినా అలా చేయలేదని మండిపడ్డారు. కులగణన సర్వేతో బీసీలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతున్నదని ఆయన ఆరోపించారు. 

బుధవారం ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ ఎల్​రమణతో కలిసి తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్​ జాబితా ప్రకారం 3.35 కోట్ల మంది ఓటర్లున్నారని, వాళ్లంతా 18 ఏండ్లకుపైబడిన వారేనని చెప్పారు. 18 ఏండ్లలోపు వారు మరో 25 శాతమైనా ఉంటారన్నారు. మొత్తం జనాభా 4 కోట్లపైనే ఉంటుందని పేర్కొన్నారు. ఎక్కువ కాలం పాటు పాలించిన కాంగ్రెస్​ ఇప్పటిదాకా దేశంలో కులగణన ఎందుకు చేయలేదని మధుసూదనా చారి ప్రశ్నించారు. మొదటి నుంచి కాంగ్రెస్​ పార్టీ బీసీల వ్యతిరేకి అని గంగుల కమలాకర్​ విమర్శించారు. 

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన సర్వే బోగస్​ అని అన్నారు. బీసీ కమిషన్​ ద్వారా సర్వే చేయించకుండా ప్లానింగ్​ డిపార్ట్​మెంట్​ ద్వారా సర్వే చేయించారన్నారు. రాష్ట్రంలో సగం ఇండ్లకు సర్వే చేసే వాళ్లు వెళ్లనే లేదన్నారు. పదేండ్లకు జనాభా పెరుగుదల కనీసం 13 శాతం ఉంటుందని.. కానీ, తక్కువ చేసి చూపించారని విమర్శించారు. 40 లక్షల మంది బీసీలను తక్కువ చేసి చూపించారన్నారు. 

కులగణనపై మరోసారి సర్వే చేయించాలని.. 15 రోజుల్లో ప్రాసెస్​ స్టార్ట్​ చేయాలని డిమాండ్​ చేశారు. ఫిబ్రవరి 4 సోషల్​ జస్టిస్​ డే కాదని, ఇన్​జస్టిస్​ డే అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. బలహీనవర్గాలకు చీకటి రోజు అని అభిప్రాయపడ్డారు.  అసెంబ్లీ సాక్షిగా బీసీలను కాంగ్రెస్​ మోసం చేసిందని ఎమ్మెల్సీ ఎల్​రమణ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే స్థానాల్లోనే బీసీలకు సీట్లు ఇచ్చిందన్నారు. కులగణనకు చట్టబద్ధత తెచ్చేదాకా కాంగ్రెస్​ను విడిచిపెట్టబోమన్నారు.