వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కి 1996 నాటి లైంగిక వేధింపుల కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఎల్లే మ్యాగజైన్ మాజీ కాలమిస్ట్ జీన్ కారోల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ట్రంప్ ను దోషిగా నిర్ధారించి 5 మిలియన్ డాలర్లు (రూ.42.7 కోట్లు) జరిమానాను విధిస్తూ జ్యూరీ ఇచ్చిన తీర్పును ఫెడరల్ అప్పీల్ కోర్టు సోమవారం సమర్థించింది. లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 2 మిలియన్ డాలర్లు, ఆమె పరువుకు నష్టం కలిగించినందుకు మరో 3 మిలియన్ డాలర్లు మొత్తం 5 మిలియన్ డాలర్లు బాధితురాలికి చెల్లించాలని స్పష్టం చేసింది.
అయితే, ఈ తీర్పుపై మళ్లీ అప్పీల్‌కు వెళ్తామని ట్రంప్ అధికార ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ వెల్లడించారు. న్యాయవ్యవస్థను రాజకీయ ఆయుధంగా వాడుకునే పద్ధతికి ముగింపు పలకాలన్నారు. కారోల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడటంతోపాటు ఆమె పరువుకు నష్టం కలింగించారని న్యూయార్క్ జ్యూరీ గతేడాది ట్రంప్‌ను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో 5 మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని ట్రంప్‌ను ఆదేశించింది. అయితే, ఈ తీర్పుపై ట్రంప్ అప్పీల్‌కు వెళ్లడంతో ఫెడరల్ కోర్టు విచారణ చేపట్టి తాజాగా తీర్పు వెలువరించింది.