ప్రజాధనాన్ని వినియోగించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు, అధికారాలకు స్పష్టమైన విభజన రేఖ ఉన్నది. అయినప్పటికీ విధానాల మార్పు , మారుతున్న ప్రాధాన్యతలు, అమలు నమూనాలో వైవిధ్యాల వల్ల తరచూ పంచాయితీలు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం.. కేంద్రం మధ్య ఆర్థిక అంశాల్లో తలెత్తిన వివాదం ఈ సూత్రీకరణకు భిన్నమైనదేం కాదు. రాజ్యాంగం నిర్దేశించిన సహకార సమాఖ్య, స్ఫూర్తి చెడకుండా ఎవరి అధికారాలను, పరిధులను వారు గుర్తించి, మసులుకుంటే ఏ వివాదాలు ఉండవు. ఒక పక్క ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం, మరోపక్క ఎన్నికల్లో లబ్ధిపొందాలనే యావ వల్ల వివాదం ముదురుతోంది. ప్రజాధనం ఎవరు వెచ్చించినా ప్రజాప్రయోజనాల కోసమే అన్నది గ్రహిస్తే ఏ పంచాయితీ లేదు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వివిధ రూపాల్లో నిధులు ఇస్తోంది. ఇందులో కేంద్ర ప్రాయోజిత పథకాలు(సీఎస్ఎస్), కేంద్ర రంగ పథకాలు (సీఎస్), ఫైనాన్స్ కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రాంట్లు(ఎఫ్సీ గ్రాంట్లు), కేంద్ర ప్రభుత్వం స్థూల బడ్జెటరీ సహకారానికి లోబడి చేసే బదిలీలు ఉంటాయి. ఈ నిధులు కొన్ని జీఎస్టీ నుంచి వచ్చినవే. రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధుల బదిలీ అంచనా 2021-–22లో సుమారు రూ.6,74,253 కోట్లు, 2020-–21లో ఇచ్చినవి రూ.7,13,014 కోట్లు. ఈ మొత్తంలో రాష్ట్రాలు తమకు అందిన నిధులను ఎంత వరకు అమలు చేశాయో ఇంతవరకు స్పష్టమైన నివేదిక ఇవ్వకపోవడం హాస్యాస్పదం. కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ఎస్) కింద నిధుల్లో పథకం బట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ నిష్పత్తుల్లో (50:50, 70:30, 75:25 లేదా 90:10) నిధులను కేటాయిస్తాయి. అమలు బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ పథకాలు రాజ్యాంగంలో రాష్ట్ర పరిధిలో ఉన్న విషయ జాబితా ఆధారంగా ఉంటాయి. అంటే రాష్ట్రాలు ప్రాధాన్యత పరంగా శ్రద్ధ వహించాల్సినవి సీఎస్ఎస్ నిధులు. రాష్ట్రాల ఏకీకృత నిధి ద్వారా లేదా నేరుగా రాష్ట్ర/జిల్లా స్థాయి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు/అమలు సంస్థలకు బదిలీ అవుతాయి. ఎప్పటి నుంచో ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లిస్తున్నాయి. ఆయా పథకాలకు పేర్లు, విధి విధానాలు తమకు తోచినట్టు రూపొందిస్తున్నాయి. సీఎస్ఎస్ పథకాల్లో నియంత్రణ లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాలు వాటా ఇవ్వకపోవడం వంటి అంశాలు కూడా పథకాల అమలు మీద నీలి నీడలు కమ్మేలా చేస్తున్నాయి. దాదాపు 15 ఏండ్లలో కేంద్రం తాను ఇచ్చే ప్రాయోజిత పథకాల్లో చాలా మార్పులు తెచ్చింది. ఈ మార్పులతో రాష్ట్రాలు వివిధ వేదికల్లో తమకు స్వేచ్ఛ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర రంగ పథకాలకు 100 శాతం కేంద్రమే నిధులు సమకూరుస్తోంది. ఇవి కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం ద్వారా అమలవుతాయి. కేంద్ర రంగ పథకాలు ప్రధానంగా రాజ్యాంగంలో కేంద్రం కోసం ఇచ్చిన విషయాలపై రూపొందుతాయి. ఈ పథకాల కింద ఉన్న వనరులను రాష్ట్రాలకు బదిలీ చేయరు. వీటికి ఈ మధ్య నిధుల కేటాయింపు పెరిగింది. ఇదివరకు రాష్ట్ర ప్రణాళికల కోసం ప్రణాళికా సంఘం కేంద్రం ద్వారా రాష్ట్రాలకు నిధులను కేటాయించేది. అప్పుడు ఇచ్చిన కేంద్ర సాయాన్ని స్థూలంగా మూడు భాగాలుగా విభజించవచ్చు. సాధారణ కేంద్ర సాయం (ఎన్సీసీఏ), అదనపు సాయం (ఏసీఏ), స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి అయోగ్ ఏర్పాటు తరువాత ఈ రకమైన సాయం మృగ్యమైపోయింది.
కేంద్రం ఇచ్చే నిధులు రాష్ట్రానివే..
2013-–14 బడ్జెట్ అంచనాల ప్రకారం బ్లాక్ గ్రాంట్లు మినహాయించి 137 సీఎస్ఎస్, 5 స్కీం ఆధారిత అదనపు కేంద్ర సాయం(ఏసీఏ) కోసం బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. పన్నెండవ పంచవర్ష ప్రణాళికలో కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ఎస్)/అదనపు కేంద్ర సాయం(ఏసీఏ) పథకాలను 17 ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలతో సహా 66 పథకాలుగా పునర్వ్యవస్థీకరించాలని 2013 జూన్ 20న కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రాల అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా పథక రచనలో రాష్ట్ర స్థాయి ప్రత్యేక మార్గదర్శకాలు ఉండవచ్చు. అంటే రాష్ట్రాలకు పథకాల మార్గదర్శకాల్లో స్వేచ్ఛ ఇచ్చినట్టే.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటోంది. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా రాష్ట్రానివే అంటోంది ఇక్కడ అధికార పార్టీ. ఏది ఏమైనా 2015-–16 కేంద్ర బడ్జెట్లో 31 పథకాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు ఇచ్చింది. 8 పథకాలను కేంద్ర మద్దతు నుంచి వేరు చేశారు. 24 పథకాలకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ వాటా నిష్పత్తి మార్చారు.
నో ఎన్‌డీసీ.. నో ప్రణాళికా సంఘం
కేంద్ర- రాష్ట్రాల మధ్య నిధులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం కేంద్ర పన్ను ఆదాయాల పంపిణీ. ఇదివరకు పంపిణీని ఆర్థిక సంఘం నిర్ణయించేది. ఒకప్పుడు ప్రణాళికా సంఘం కేంద్ర పన్ను ఆదాయంలో 32.5 శాతం రాష్ట్రాలకు ఇచ్చేది. 2011-–12లో రూ.2.5 లక్షల కోట్లు (మొత్తం బదిలీల్లో 57 శాతం)గా నిర్ణయించింది. ఇది అతిపెద్ద బదిలీ. దీనికి అదనంగా, ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ప్రణాళికేతర గ్రాంట్లు, రుణాలను నియంత్రించే సూత్రాలను సిఫారసు చేసేది. ప్రతి రాష్ట్రంతో ప్రణాళికా సంఘం నిరంతర సంప్రదింపులు జరిపేది. ప్రణాళికా సంఘం సిఫారసులను జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ) ఆమోదం తెలిపే పద్ధతి ఉండేది. ఎన్‌డీసీ 2012 డిసెంబర్లో జరిగిన సమావేశంలో 12వ ప్రణాళికను ఆమోదించినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు అనుగుణంగా పథకాల్లో సరళీకరించాలని సిఫారసు చేసింది. ఇప్పుడు ప్రణాళిక సంఘం లేదు, జాతీయ అభివృద్ధి మండలి సమావేశాలూ లేవు. నీతి అయోగ్ ప్రణాళిక సంఘం స్థానాన్ని ఈ విషయంలో భర్తీ చేయలేదు. ఈ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంఘర్షణా భావం ఎక్కువైపోతోంది. అలాగే రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తులకు ఉపశమనంగా రోడ్ల నిర్వహణ, ఇతర నిర్దిష్ట అభ్యర్థనల కోసం నిధులను ఆర్థిక సంఘం కేటాయిస్తుంది. ఈ కేటాయింపులు రాష్ట్రాల పన్ను ఆదాయం, గ్రాంట్ల పంపిణీ, జనాభా (25%), వైశాల్యం (10%), ఆర్థిక సామర్థ్యం (47.5%), ఆర్థిక క్రమశిక్షణ (17.5%) వంటి అంశాల ఆధారంగా సూత్ర ప్రకారం నిర్ణయిస్తుంది. అందువల్ల ప్రణాళికా సంఘం లాగా కాకుండా, ఆర్థిక సంఘం తన కేటాయింపుల్లో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాన్ని చూపే అవకాశం ఉండదు. 14వ ఆర్థిక సంఘం (ఎఫ్ఎఫ్సీ) కేంద్ర విభజన పూల్‌లో రాష్ట్రాల వాటాను 32% నుంచి 42% శాతానికి పెంచింది. ఈ నిధులు రాష్ట్రాలు కోరుకున్న విధంగా ఖర్చు చేయవచ్చు. కాగా, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల వల్ల తెలంగాణాకు 2020 నాటికి రూ.16 వేల కోట్ల నష్టం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం 2015లో అంచనా వేసి, భర్తీ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. 2015 నాటికి కేంద్రం నుంచి దాదాపు రూ.8,100 కోట్లు బకాయిలు రావాల్సి ఉండగా కేవలం రూ.900 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి నష్టాలు, బకాయిలు ఎన్ని ఉన్నాయి, ఏ పద్దు కింద ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ అంశాల మీద సమాచారం ఇరు ప్రభుత్వాలు ఇవ్వకుండా.. ఒక నిర్దిష్ట నివేదిక ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నాయి.
ఫెడరల్ వ్యవస్థ బలహీనమవుతోందా?
కేంద్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేసే (డీబీటీ) పథకాలకు మొగ్గు చూపుతోంది. విద్యుత్ సబ్సిడీని కూడా ఇలాగే ఇవ్వాలని నిర్ణయించింది. ఉత్పత్తి రంగంలో పీఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత సబ్సిడీ) పథకం ద్వారా కేంద్రమే నేరుగా పరిశ్రమలకు సబ్సిడీ ఇస్తోంది. కేంద్రం ప్రధాన మంత్రి గతి శక్తి పథకం, భారత్ మాల, ఇంకా ఇతర అనేక పథకాల పేరుతో నేరుగా ఖర్చు పెడుతోంది. 2015-–16లో కేంద్రం ప్రతిపాదించిన బడ్జెట్ పరిమాణం రూ.17.77 లక్షల కోట్లు. అది 2022–-23 నాటికి 2.5 రెట్లు పెరిగింది. అప్పులు కాకుండా రాష్ట్రాలకు ఇస్తున్న నిధులు పెరగలేదు. గ్రామీణ వ్యవస్థకు తలమానికం అయిన పంచాయతీలకు కేంద్ర నిధులు ఇంకా తగ్గాయి. రాజ్యాంగం నిర్వచించిన ఫెడరల్ వ్యవస్థ క్రమంగా బలహీనపడుతోంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ప్రాధాన్యత లేకుండా పోతోంది. నిధులను గుప్పిట్లో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చేబడుతున్న ఏకాయెకి ‘విస్తరణ’ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
ముఖ్యమంత్రుల నివేదిక ప్రకారం..
2015లో ముఖ్యమంత్రుల కమిటీ కేంద్ర పథకాలకు సంబంధించి ఇచ్చిన ఓ నివేదికను కేంద్రం ఆమోదించింది. తెలంగాణా సీఎం సహా 10 మంది ముఖ్యమంత్రులు ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వ పథకాలను 72 నుంచి 30కి కుదించాలని కోరారు. ప్రతి పథకంలో 25 శాతం నిధులు తమకు కావాల్సిన రీతిలో ఇతర పథకాలకు ఖర్చు పెట్టుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. వారు చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించింది. ఆ నివేదిక మేరకు కేంద్ర పథకాలు 4 రకాలు. కేంద్రం పూర్తిగా నిధులు అందజేసే 7 ముఖ్యమైన పథకాలు మొదటి రకం. రెండో రకంలో జాతీయ అభివృద్ధికి ముఖ్యమని భావించే 17 పథకాలను చేర్చారు. వీటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా 60:40 నిష్పత్తిలో ఉంటుంది. మొదటి రెండు రకాల్లో రాని పథకాలు మూడో రకంలో ఉంటాయి. వీటిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా 50:50 నిష్పత్తిలో ఉంటుంది. వీటి అమలు రాష్ట్రాల ఇష్ట ప్రకారంగా చేసుకోవచ్చు. నాలుగో వర్గీకరణలో కేంద్ర పథకాలుగా 4 రకాల పథకాలు అమలవుతాయి. అయితే, ఈ కొత్త రకం ఏర్పాటు అమలు తీరును గత 7 ఏండ్లలో సమీక్ష చేసినట్లు లేదు. ఈ విధంగా 4 రకాలుగా వర్గీకరించిన పథకాలకు నిధుల బదిలీ ఏ విధంగా అయ్యింది పరిశోధన చేయాల్సి ఉంది. 14వ ఆర్థిక సంఘం పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటా పెంచింది కాబట్టి కేంద్రం నుంచి ప్రణాళిక పద్దు కింద ఇచ్చే నిధులు ఆ మేరకు తగ్గుతున్నాయని నివేదిక చెప్పింది. 2015 ముఖ్యమంత్రుల నివేదిక ప్రకారం రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర నిధులు 37 శాతం. ఇది పెంచే ప్రయత్నం ఈ నివేదిక చేసింది. ఇప్పుడు ఆ మేరకు కూడా కేంద్రం ఇవ్వడం లేదు. మొత్తం కేంద్ర బడ్జెట్ 2022–23లో ఖర్చు అంచనా రూ.44,14,361.42 కోట్లు. కాగా రాష్ట్రాలకు ప్రతిపాదించిన నిధుల బదలాయింపు రూ.7,95,131.03 మాత్రమే. అదే 2020-2021లో అయిన ఖర్చు కూడా మొత్తం బడ్జెట్లో 18 శాతం మాత్రమే. దీన్ని బట్టి కేంద్ర నిధులు కేంద్రమే నేరుగా ఖర్చు చేస్తోంది. 2015-16 లో అయిన ఖర్చులో రాష్ట్రాలకు ఇచ్చింది 15.6 శాతం. 14వ ఆర్థిక సంఘం సిఫారసులు కలుపుకుంటే 31.68 శాతం మాత్రమే.