భారత రాజ్యాంగంలో సంపూర్ణ సమాఖ్యకు ఉండే లక్షణాలు లేవు. సమాఖ్య అనే పదం రాజ్యాంగంలో ఏ నిబంధనలోనూ లేదు. భారత రాజ్యాంగం స్వరూపంలో మాత్రమే సమాఖ్య, తాత్వికంగా మాత్రం ఏక కేంద్రం. భారతదేశ సమాఖ్య స్వరూపాన్ని అనుసరించడానికి రెండు కారణాలున్నాయి.
అవి.. 1. భౌగోళికంగా దేశభూభాగం అతి పెద్దదై ఉండటం, 2. దేశం సామాజిక, సాంస్కృతిక భిన్నత్వం. దేశంలో ఉన్న విభాజక శక్తులను నియంత్రించడానికి, దేశంలో రాష్ట్రాల మీద కేంద్రానికి పట్టు ఉండటం కోసం భారత రాజ్యాంగాన్ని తాత్వికంగా ఏకకేంద్రంగా రూపొందించారు. ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా అంటే భారత్ ఒక రాష్ట్రాల సముదాయమని పేర్కొన్నారు. అంబేద్కర్ ప్రకారం ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అనే పదానికి బదులు యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదాన్ని రెండు కారణాల వల్ల ఉపయోగించారు. 1. భారత సమాఖ్య అమెరికా లాగా వివిధ రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడలేదు. ఇది ఏక కేంద్రాన్ని విచ్ఛిన్నం చేసి ఏర్పడింది. 2. రాష్టాలకు సమాఖ్య నుంచి విడిపోయే హక్కు లేదు. రాష్ట్రాలను విచ్ఛినం చేయొచ్చు గానీ యూనియన్ను విచ్ఛిన్నం చేయలేం. భారత సమాఖ్య బలమైన కేంద్రం, ఆ కేంద్రం మీద ఆధారపడ్డ రాష్ట్రాలు అనే పద్ధతిపై ఆధారపడి రూపొందించారు. ఇది కెనడా నమూనాను పోలి ఉంది.
సమాఖ్య లక్షణాలు
- ద్వంద్వ ప్రభుత్వాలు: భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంది. కేంద్రం జాతీయ ప్రాధాన్యత కలిగిన రక్షణ, విదేశీ వ్యవహారాలు, ద్రవ్యం వంటి అంశాలను, రాష్ట్రాలు ప్రాంతీయ ప్రాధాన్యత కలిగిన వ్యవసాయం, ఆరోగ్యం, స్థానిక ప్రభుత్వాలు వంటి అంశాలను పోలి ఉంటాయి.
- లిఖిత రాజ్యాంగం: కేంద్రం, రాష్ట్రాల మధ్య స్పష్టంగా అధికారాలను విభజించడానికి లిఖిత రాజ్యాంగం అవసరం.
- అధికార విభజన: కేంద్ర, రాష్ట్రాల మధ్య కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాల రూపంలో అధికార విభజన చేయబడింది.
- రాజ్యాంగ ఔన్నత్యం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సృష్టించే రాజ్యాంగమే అన్నింటికంటే ఉన్నతమైంది. ఈ రాజ్యాంగ ఔన్నత్యాన్ని పరిరక్షించడానికి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయసమీక్ష అధికారాన్ని కలిగి ఉంటాయి.
- దృఢ రాజ్యాంగం: రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలను ప్రభావితం చేసే అంశాల విషయంలో రాజ్యాంగ సవరణ చేయాలి. అంటే పార్లమెంట్ ఆమోదంతోపాటు కనీసం సగం రాష్ట్రాల ఆమోదం కూడా అవసరమవుతుంది.
- స్వతంత్ర న్యాయవ్యవస్థ: కేంద్ర, రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలు, రాష్ట్రాలు, రాష్ట్రాలకు మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు రూపంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ ఏర్పాటు చేయబడింది.
- ద్విసభా విధానం: కేంద్ర పార్లమెంట్లో రెండు సభలుంటాయి. దిగువ సభ అయిన లోక్‌సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎగువసభ అయిన రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి రాజ్యసభను రాష్ట్రాల మండలి అంటారు. పై లక్షణాలు అన్నీ భారత సమాఖ్య లక్షణాలుగా పరిగణిస్తారు. కాబట్టే సుప్రీంకోర్టు 1962లో ఆటోమొబైల్ ట్రాన్స్పోర్ట్ వర్సెస్ రాజస్థాన్ ప్రభుత్వం కేసులో భారత రాజ్యాంగాన్ని సమాఖ్య అని వర్ణించింది.
- ఏక కేంద్ర లక్షణాలు :భారత రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలతోపాటు ఏక కేంద్ర లక్షణాలూ ఉన్నాయి. కాబట్టి కేసీ వేర్, అలెగ్జాండ్రోవిజ్ భారత సమాఖ్యను అర్థ సమాఖ్య అని వర్ణించారు.
- అధికార విభజన: కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన జరిగినా కేంద్రమే రాష్ట్రాల కంటే బలమైంది.
- అవశిష్టాధికారాలు: కెనడాలో లాగే అవశిష్టాధికారాలు కేంద్రానికి ఇచ్చారు.
- ఒకే రాజ్యాంగం: దేశానికి ఒకే రాజ్యాంగం ఉంది. రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగం లేదు.
- రాజ్యాంగ సవరణ: ఈ ప్రక్రియలో రాష్ట్రాలకు అతి తక్కువ పాత్ర ఉంటుంది.
- రాష్ట్రాలకు ప్రాతినిధ్యం: పార్లమెంట్లో రాష్ట్రాలకు సమానమైన ప్రాతినిధ్యం లేదు. అత్యవసర పరిస్థితుల్లో దేశం పూర్తిగా ఏక కేంద్రంగా ఉంటుంది.
- ఏక పౌరసత్వం: రాష్ట్రాలు ఉన్నప్పటికీ పౌరులకు రాష్ట్ర పౌరసత్వం లేదు. ఏక పౌరసత్వం మాత్రమే ఉంది.
- ఏకీకృత న్యాయ వ్యవస్థ: రాష్ట్రాలు ఉన్నప్పటికీ అమెరికాలో లాగే ద్వంద్వ న్యాయవ్యవస్థ కాకుండా బ్రిటన్‌లో లాగే ఏకీకృత న్యాయవ్యవస్థ ఉంది. భారత్‌లో కేంద్ర, రాష్ట్రాలకు ఒకే న్యాయ వ్యవస్థ ఉంది. కేంద్ర, రాష్ట్ర చట్టాలను సమీక్షించడం కోసం అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టు పనిచేస్తుంది. అయితే, రాష్ట్ర చట్టాలను సమీక్షించడానికి ప్రత్యేకమైన కోర్టులు లేవు. రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. భారతదేశమంతటా ఒకే విధమైన నేరశిక్షాస్మృతి అమలులో ఉంది.
- అఖిలభారత సర్వీసులు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉమ్మడిగా పనిచేస్తూ కేంద్రం ఏజెంట్లుగా వ్యవహరించే అఖిల భారత సర్వీసుల ఉద్యోగులు యూనియన్ పబ్లిక్ కమిషన్ ద్వారా ఎంపికై, రాష్ట్రపతి చేత నియమించబడి రాష్ట్రాల్లో పనిచేస్తూ కేంద్రానికి బాధ్యులుగా ఉంటారు.
- హోదా: అన్ని రాష్ట్రాలకు సమాన హోదా లేదు. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించబడింది.
- ఏకీకృత సర్వీసులు: కేంద్ర, రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉంటాయి.
- గవర్నర్ కేంద్రం నామినేట్ చేయడం.
- గవర్నర్ రాష్ట్ర బిల్లులను రాష్ట్రపతి ఆమోదానిక పంపడం.
- గవర్నర్ బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపడం.
- పార్లమెంట్‌కు రాష్ట్రాల భౌగోళిక స్వరూపాన్ని మార్చే అధికారం ఉండటం.
ఆర్టికల్స్
- 252: రాష్ట్రం కోరికపై పార్లమెంట్ రాష్ట్ర జాబితాపై చట్టం చేస్తుంది.
- 258, 258ఏ: రాష్ట్రపతి, గవర్నర్ పరస్పరం విధులను అప్పగించుకోవచ్చు.
- 355: రాష్ట్రాలను విదేశీ దాడుల నుంచి, అంతర్గత కల్లోలం నుంచి కాపాడటం కేంద్రం బాధ్యత.
- 268 నుంచి 270: కేంద్రం కొన్ని పన్నులను రాష్ట్రాలకు ఇచ్చివేయడం గాని, రాష్ట్రాలతో పంచుకోవడం గాని చేస్తుంది.
- 285, 289: కేంద్ర, రాష్ట్రాలు పరస్పర పన్నుల నుంచి మినహాయింపు పొందుతుంటాయి.
- 263: ప్రజాప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రపతి అంతర్ రాష్ట్రమండలిని ఏర్పాటు చేస్తారు.
- 262: అంతర్ రాష్ట్ర నదీజల వివాదాలను పరిష్కరించడానికి పార్లమెంట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తుంది.
- 275: కేంద్రం ప్రతి సంవత్సరం రాష్ట్రాలకు సహాయ నిధులను ఇస్తుంది.
- 280: కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీని సూచించడానికి రాష్ట్రపతి ఆర్థికసంఘం ఏర్పాటు చేస్తాడు.
- 301: అంతర్ రాష్ట్ర వ్యాపార కార్యకలాపాల్లో అన్ని రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చారు.
ఏకీకరణ ద్వారా సమాఖ్య: కొన్ని స్వతంత్ర రాజ్యాలు వ్యూహాత్మక కారణాల వల్ల ఒప్పందం ద్వారా ఒకే రాజ్యంగా ఏర్పడాలని సంధి కుదుర్చుకుంటాయి. ఆ విధంగా ఏర్పడిన రాజ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. ఒప్పందం ద్వారా ఏకమైన చిన్న రాజ్యాలు అన్నీ రాష్ట్రాలుగా వ్యవహరిస్తారు.ఈ విధంగా 1787లో ఏర్పడిన మొదటి సమాఖ్య అమెరికా.
విఘటన లేదా విచ్చిత్తి వల్ల సమాఖ్య: జనాభారీత్యా, భౌగోళిక లక్షణాలరీత్యా సుపరిపాలన అందించడం కోసం పెద్ద దేశాలు బలమైన కేంద్రంగా గల చిన్నచిన్న స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రాలుగా విఘటన చెందుతాయి. ఇలా ప్రపంచంలో విచ్ఛిత్తి ఫలితంగా ఏర్పడిన సమాఖ్యకు మంచి ఉదాహరణ కెనడా. దేశాన్ని చెప్పవచ్చు. కెనడాలో మౌలికంగా నాలుగు ప్రావిన్సుల ఉండగా, ప్రస్తుతం 10 ఉన్నాయి.
సమాఖ్య, ఏక కేంద్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు ( సమాఖ్య లక్షణాలు)
- కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రభుత్వం
- కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన
- లిఖిత రాజ్యాంగం
- రాజ్యాంగ ఔన్నత్యం
- స్వతంత్ర న్యాయ వ్యవస్థ
- ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు
- ద్విసభా విధానం
- దృఢ రాజ్యాంగం
ఏక కేంద్ర లక్షణాలు
- ఒకే ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం
- అధికార విభజన లేదు, మొత్తం అధికారాలు
- అధికార విభజన లేదు, మొత్తం అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి.
- రాజ్యాంగం లిఖితం కావచ్చు, కాకపోవచ్చు.
- రాజ్యాంగ ఔన్నత్యం ఉండవచ్చు, ఉండకపోవచ్చు.
- స్వతంత్ర న్యాయ వ్యవస్థ
- ద్విసభ విధానం లేదా ఏకసభా విధానం ఉండవచ్చు
- దృఢ రాజ్యాంగం కావచ్చు లేదా అదృఢ రాజ్యాంగం ఉండవచ్చు