పేదల కోసం GHMC కొత్త కార్యక్రమం : ఫీడ్ ద నీడ్

పేదల కోసం GHMC కొత్త కార్యక్రమం : ఫీడ్ ద నీడ్

ఈనెల 14 నుంచి కొత్త కార్యక్రమాన్ని మొదలుపెడుతోంది జీహెచ్ఎంసీ. ఎవరైనా తిండిలేక ఆకలితో అలమటిస్తుంటే.. వారికి ఆహారం అందించాలని కోరుతోంది. అందుకోసం లవర్స్ డే నుంచి ఫీడ్ ద నీడ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని డిసైడ్ అయింది బల్ధియా.

గ్రేటర్ పరిధిలో ఉత్పత్తి అవుతున్న చెత్తలో 15 శాతం వరకు ఆహార పదార్థాలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ పడేసే ఆహార పదార్థాలను ఇతరులకు అందించడం ద్వారా.. ఆకలితో పస్తులుండే వారి కడుపులు నింపొచ్చని భావిస్తోంది. అందుకే ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని తెస్తున్నామన్నారు బల్ధియా బాస్ దాన కిశోర్.  ఎన్జీవోల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపడతామన్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్ కూడా తెస్తామన్నారు.

జీహెచ్ఎంసీ చేపడుతున్న ఫీడ్ ద నీడ్ అనే కార్యక్రమానికి హోటల్స్ యజమానులు కూడా సహకరించాలన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. సిటీలోని హోటల్ ఓనర్లతో సమావేశమై… ఫీడ్ ద నీడ్ కార్యక్రమంపై చర్చించారు. ప్రతి ఒక్క హోటల్ ఫుడ్ వేస్ట్ గా పడేయకుండా.. పేదలకు అందించాలన్నారు.

ఇప్పటికే నగరంలో శిల్పారామం, జూబ్లీ చెక్ పోస్ట్ సర్కిల్ దగ్గర ఆహారపదార్ధాలను నిల్వ  ఉంచడానికి రిఫ్రిజిరేటర్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలను ప్రేమిద్దాం… వారి ఆకలి తీరుద్దాం అంటూ కొత్త నినాదం అందుకుంది బల్ధియా.