హైదరాబాద్, వెలుగు: సరిగ్గా ఆహారం దొరక్కపోవడంతోనే కుక్కల దాడులు జరుగుతున్నాయని యానిమల్ లవర్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కుక్కల దాడులను ఆపేందుకు గ్రేటర్‌లోని కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, ప్రధాన రహదారులపై ఫీడింగ్ సెంటర్లు, నీటి కోసం తొట్టెలు ఏర్పాటవుతున్నాయి. వలంటీర్లు, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కాలనీతో పాటు వీధి కుక్కలు ఎక్కువగా ఉన్న రోడ్లపై ఏర్పాటు చేస్తున్నారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం కాలనీల్లో ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం జీహెచ్ఎంసీ సర్క్యులర్ జారీ చేసినప్పటికీ ఈ విషయంపై పెద్దగా అవగాహన కల్పించలేదు. ఇటీవల కుక్క కాటు కేసులు పెరగడంతో వలంటీర్లు, డాగ్ లవర్స్‌తో కలిసి జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు ఫీడింగ్సెంటర్లపై అవేర్నెస్ కల్పించి వాటిని ఏర్పాటు చేయిస్తున్నారు.
అందుకే మనుషులపై దాడి..
కాలనీల్లో ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పెట్టడంతో అక్కడి వాటికి, ఇతర చోట్ల నుంచి వచ్చిన కుక్కల మధ్య గొడవ ఏర్పడుతోంది. అప్పటికే ఆకలి, ఆ సమయంలో కోపం కారణంగా మనుషులపై దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కుక్కలకు ప్రత్యేకంగా ఫీడింగ్ సెంటర్లు, నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తే ఏ కాలనీలో ఉండే కుక్కలు అక్కడే తిని ఉంటాయని, దీని ద్వారా వాటి మధ్య గొడవ కాకుండా.. జనంపై దాడులు చేయకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నం.12లో కుక్కల కోసం ప్రత్యేకంగా నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. అలాగే కంచన్‌బాగ్, బోయిన్‌పల్లిలోని సాయిసాగర్ ఎన్ క్లేవ్, హస్మత్‌పేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లోని చాలా కాలనీల్లో ఫీడింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇంట్లో మిగిలిన ఫుడ్ ఉంటే తీసుకొచ్చి అక్కడ
వేస్తున్నారు.
చాలా చోట్ల ఎప్పటి నుంచో..
యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఎప్పటి నుంచో ఫీడింగ్ సెంటర్లు ఉన్నాయి. రాజస్థాన్, ఒరిస్సా రాష్ట్రాల్లో స్ట్రీట్ డాగ్స్ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక ఫండ్స్ కేటాయిస్తున్నాయి. ఈ ఫండ్స్ ద్వారా కుక్కలకు ఫీడింగ్ చేస్తున్నారు. అయితే మన రాష్ట్రంలో అలాంటి ఫెసిలిటీ లేనప్పటికీ ఫీడింగ్ సెంటర్ల ఏర్పాటుకు బల్దియా చర్యలు తీసుకుంటోంది. రానున్న రోజుల్లో ప్రతి కాలనీలో ఏర్పాటు చేయిస్తామని బల్దియా వెటర్నరీ అధికారులు చెప్తున్నారు.
జీహెచ్ఎంసీ సపోర్టు కావాలి..
అన్ని చోట్లా ఫీడింగ్ సెంటర్లు ఉండేలా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోవాలి. కొన్ని చోట్ల వలంటీర్లు పెడుతున్నరు. అందులో డైలీ నీటిని జీహెచ్ఎంసీ నింపాలి. ఫీడింగ్ సెంటర్లు ఉంటేనే ఇండ్లకు అనుమతులు ఇవ్వాలి. అప్పుడే డాగ్స్‌కు వాటర్, ఫుడ్ సరిపడా దొరుకుతుంది.
- అంచల్ ఖన్నా, వలంటీర్